ఒక పరాజయం 100 తప్పులు.. 'కమ్మ' బ్రాండ్ కొంప ముంచిందా?

 

టీడీపీ ఘోర పరాజయంలో కమ్మ బ్రాండ్ కీలక పాత్ర పోషించిందా అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్లాన్ ప్రకారం పార్టీ మీద కమ్మ ముద్ర వేయడానికి ప్రయత్నించారు. ఆ విషయం ప్రజల్లోకి బలంగా వెళ్తున్నా.. దాన్ని గుర్తించలేకపోయారు, ఒకవేళ గుర్తించినా ఆ ముద్రని పోగొట్టడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని చెప్పాలి. దాదాపు అన్ని పార్టీలకు ఏదొక కుల ముద్ర వేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ నిజానికి ఏ కులమూ ఓ పార్టీకి పూర్తిగా మద్దతు తెలపదు, తెలిపిన దాఖలాలు కూడా లేవు. టీడీపీ విషయంలో కూడా అదే జరిగింది. నిజానికి కమ్మ సామాజికవర్గమంతా టీడీపీ వెంటలేదు. అది 2019 ఎన్నికల ఫలితాల్లో కూడా తేలిపోయింది. ఎందుకంటే కమ్మ వారు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. అంటే ఎన్నికల ముందు టీడీపీ కమ్మ పార్టీ అని చేసిన ప్రచారమంతా కావాలనే చేసిందని అర్ధమవుతోంది. కానీ దీన్ని పసిగట్టడంలో బాబు విఫలమయ్యారు.

అప్పట్లో టీడీపీని బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ అనే వారు. కొందరు బీసీల పార్టీ అని కూడా అనేవారు. కానీ ఈ మధ్య కమ్మ పార్టీ అనే ముద్ర పడింది. అసలు నిజానికి బాబు కమ్మ సామాజికవర్గాన్ని కావాలనే దూరం పెడతారని కూడా పార్టీలో చెప్పుకుంటారు. ఎక్కడ కుల ముద్ర పడుతుందేమోనన్న భయంతో.. వారి దగ్గర విషయం, నిజాయితీ ఉన్నా కూడా భయంతో పక్కన పెట్టేవారట. దీంతో కమ్మ వర్గం బాబుకి దూరమవుతూ వచ్చిందట. కుల ముద్ర పడకూడదని ముందు జాగ్రత్త తీసుకున్న బాబు.. తీరా పార్టీ మీద జరిగిన తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఓ వైపు కమ్మ వారిని దూరం చేసుకున్నారు, మరోవైపు పార్టీపై పడిన కమ్మ ముద్ర ప్రచారాన్ని తిప్పికొట్టలేక ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నారు.