టీడీపీలో చేరనున్న కామినేని శ్రీనివాస్

 

మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరనున్నారనే వార్తలు గతకొంత కాలంగా గుప్పుమంటున్నాయి.ఈ వార్తలకు ఆజ్యం పోసినట్టు ఆయన టీడీపీ అధినేత,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలిశారు.దీంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.గత ఎన్నికల్లో బీజేపీ,టీడీపీ సమన్వయంతో ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి విదితమే.ఎన్నికల అనంతరం బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్ (వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి), మాణిక్యాల రావు (దేవదాయ శాఖ మంత్రి) చంద్రబాబు మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు.అయితే అనుకోని పరిణామాలతో నాలుగేళ్లకు బీజేపీ నుంచి టీడీపీ దూరమైంది.అంతేకాకుండా కేంద్రంలో మంత్రులుగా ఉన్న టీడీపీ ఎంపీలు అశోక్ గజపతిరాజు,సుజనా చౌదరి తమ పదివికి రాజీనామా చేశారు.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కామినేని శ్రీనివాస్,మాణిక్యాలరావు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.అయితే కామినేని కి మొదటినుంచి చంద్రబాబు ప్రాముఖ్యతనిస్తూ వచ్చారు.ముఖ్యమైన నిర్ణయాల్లో,సమావేశాల్లో చంద్రబాబుకి వెన్నంటి ఉండేవారు.అయితే మంత్రి పదవికి దూరం అయిన తర్వాత ఆయన ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు.బీజేపీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.దీంతో ఆయన టీడీపీలో చేరతారని వార్తలు వచ్చాయి.అయితే రాష్ట్రంలో ఎన్నికలు కూడా దగ్గర పడనున్న నేపథ్యంలో ఆయన చంద్రబాబుతో భేటీ అవ్వటం చర్చనీయాంశం అయింది.చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం కొద్దీ ఆయన పార్టీలో చేరటానికి మార్గం సుగమం అయినట్లు తెలుస్తుంది.