పార్టీ అధ్యక్ష పదవికి కంభంపాటి రాజీనామా...

 

గత నాలుగేళ్లుగా పార్టీ రాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తున్న ఏపీ బీజేపీ నేత, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు  తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం రాత్రి తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు ఆయన తన రాజీనామా లేఖను పంపారు. గత కొద్దిరోజులుగా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇంత అకస్మాత్తుగా ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. అధ్యక్ష పదవిని ఆయన తనకు తానుగా వదులుకున్నారా? లేక అధిష్ఠానం సూచన మేరకే రాజీనామా చేశారా? అని చర్చించుకుంటున్నారు.

 

కాగా రాష్ట్ర విభజన సమయంలో హరిబాబును భాజపా రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకటించారు. తెదేపాతో మిత్రధర్మం కాపాడుతూ నాలుగేళ్ల పాటు తన బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. మృధు స్వభావిగా ఉండే హరిబాబు.... తెదేపాతో విభేదాలు వచ్చిన సమయంలోనూ పూర్తి సంయమనంతో వ్యవహరించారు. అవతలి వైపు నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నా తన సహజ ధోరణిలో వ్యవహరించారే తప్ప... ఎక్కడా దూకుడుగా వెళ్లలేదు. పార్టీలోని కొందరు నేతలు ఈ విషయంలో దూకుడు పెంచాలని సూచించినా తన సహజత్వానికి భిన్నంగా వెళ్లలేనని తేల్చిచెప్పేవారు.