స్టార్ పాలిటిక్స్... రజిని - కమల్ కలిసి బరిలోకి దిగనున్నారు

 

తమిళనాడు రాజకీయం కొత్త మలుపు తిరిగింది. మొన్నటి వరకూ అన్నాడిఎంకె వర్సెస్ డీఎంకే గా ఉన్న రాజకీయం ఇప్పుడు సినిమా స్టార్స్ వర్సెస్ పొలిటికల్ లీడర్స్ గా మారిపోయింది. కమల్ హాసన్, రజినీకాంత్  కలిసి పని చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లు కమల్, రజనీ ఎవరికివారే అనే విధంగా  వ్యవహరించారు. కానీ ఇప్పుడు రాజకీయంగా ఇద్దరూ చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు. దీంతో తమిళ రాజకీయాలు ఇప్పుడు కొత్త మలుపు తీసుకున్నాయి. తమిళ ప్రజల కోసం కమల్ హసన్ తో కలిసి పని చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేతులు కలుపుతాం అన్నారు.

తాము ఎప్పటి నుంచో స్నేహితులమని ఇద్దరి ధ్యేయం ప్రజల సంక్షేమమే అన్నారు రజనీ. మరోవైపు రజనీకాంత్ వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేశారు కమల్. రజనీకాంత్ తో చేతులు కలుపుతానని అన్నారు. తమిళ ప్రజల కోసం ఇద్దరం కలిసి ముందుకు వెళ్లడంలో ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి అన్నారు కమల్ హాసన్. వాస్తవానికి రజనీకాంత్ ఇంత వరకు పార్టీ పేరు ప్రకటించలేదు. రెండేళ్లగా ఆయన పార్టీ ఏంటి అనేది చర్చ జరుగుతూనే ఉంది. తమిళనాట రాజకీయ శూన్యత ఉందని అనిపించే దాక తాను సీఎం అయ్యే వరకు ఎంజీఆర్ లా సినిమాలో నటిస్తానంటూ ఇటీవలే చెప్పారు. అయితే సినిమా వాళ్లకు రాజకీయాలు ఏం తెలుసు అని సీఎం పళని స్వామి మండిపడ్డారు. తమిళనాడులో రాజకీయ శూన్యత లేదని కేవలం పబ్లిసిటీ కోసమే సినిమా వాళ్లు విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే పళనిస్వామి వ్యాఖ్యలే రజనీ, కమల్ కలిసేలా చేసాయంటున్నారు తమిళ ప్రజలు. మరోవైపు కమల్ పార్టీ పెట్టి ఫెయిలయ్యారని రజనీ ఎప్పుడు పార్టీ పెడతారో తెలీదని గౌతమి విమర్శించారు. ఎవరేం చేస్తారో ముందు ముందు తెలుస్తాయంటున్నారు బిజెపి నేత గౌతమి. మొన్నటి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన కమల్ హాసన్ పార్టీ సీట్లు గెలుచుకోకపోయినా భవిష్యత్తుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. అందుకే తనకు రజనీకాంత్ తోడైతే అధికారం సాధించొచ్చని ఆలోచన కమల్ కి వచ్చింది.

గతంలో సినీ రంగానికే చెందిన ఎంజీఆర్, కరుణానిధి, డీఎంకేలో చేరి కలిసి పనిచేసారు. ఇప్పుడు సినీ రంగానికి చెందిన వారే కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారు. భావసారూప్యత దూకుడులో కరుణానిధికి, కమల్ హాసన్ కు దగ్గరి పోలికలుంటే ఎంజీఆర్ తో రజినీకాంత్ కు దగ్గరి పోలికలున్నాయంటున్నారు విశ్లేషకులు. జయలలిత మరణం తర్వాత కొంత కాలం పాటు సైలెంట్ గా ఉన్న సినీ స్టార్స్ ఇప్పుడు మళ్లీ ఒకటై జనాలలోకి వస్తున్నారు. డిసెంబర్ లో తమిళనాట మునిసిపల్ ఎన్నికలు జరగనున్న పరిస్థితుల్లో రజనీ, కమల్ ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది.