ప్రజల ముందుకు జగన్ నిర్వాకం.. జే ట్యాక్స్ తో వైసీపీకి రూ.20 వేల కోట్ల ఆదాయం!

తెలుగుదేశం పార్టీ ప్రజా చైతన్య యాత్రకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రజా చైతన్య యాత్రను టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ప్రకాశం జిల్లాలో ప్రారంభించనున్నారు. 45 రోజుల పాటు జరుగనున్న ఈ  ప్రజా చైతన్య యాత్రకి సంబంధించిన కరపత్రాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ యాత్ర ద్వారా 9 నెలల్లో జగన్ చేసిన నిర్వహకాలు, మోసాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. వైసీపీ తొమ్మిది నెలల పాలన 9 రద్దులు, 9 భారాలతో గడిచిందని ఎద్దేవా చేశారు. పోలీస్ వ్యవస్థను చేతిలోకి తీసుకుని రాజ్యాంగ వ్యవస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కళా వెంకట్రావ్ విమర్శించారు. 

ఎన్నికలముందొకటి చెప్పిన వైఎస్ జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం కులాలు, మతాలవారీగా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని, ప్రజలకు ఉపయోగపడే పథకాలను రద్దు చేస్తోందని ఆరోపించారు. టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలను పెంచారని, అర్హుల పింఛన్లు తొలగించారని, మరిన్ని పింఛన్లు తొలగించే ప్రయత్నంలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. 

అధికార పార్టీ నేతలు జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఈ ట్యాక్స్ కింద అధికార పార్టీకి రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తోందని ఆరోపించారు. సారా దుకాణాల్లో ఎక్సైజ్ స్టాఫ్‌తో పాటు వైసీపీ కార్యకర్తలను పెట్టారని, పోలీసులను చేతిలో పెట్టుకుని ఎన్నాళ్లు పాలన సాగిస్తారని కళా వెంకట్రావు ప్రశ్నించారు. రాజకీయపార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పరిస్థితుల్లో.. ప్రజల ముందుకు వెళ్తున్నామని, ప్రజల తరఫున పోరాటం చేస్తామని కళా వెంకట్రావ్ స్పష్టం చేశారు.