కాకినాడ కార్పొరేషన్‌లో ద్వారంపూడి పెత్తనం..! మేయర్‌ను డమ్మీగా మార్చేసి రాజకీయం..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తూర్పుగోదావరిది ప్రత్యేక స్థానం. ఎందుకంటే, తూర్పు ప్రజలు ఏ-పక్షాన ఉంటారో వాళ్లే అధికారంలోకి వస్తారు. అంతలా స్టేట్ పాలిటిక్స్ ను షేక్ చేస్తారు ఇక్కడి జనం. ఇది ఒక్కసారి కాదు... అనేకసార్లు రుజువైంది. 2019 ఎన్నికల్లో కూడా అదే జరిగింది. 2014లో టీడీపీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టి అధికారం పీఠంపై కూర్చోబెట్టిన తూర్పుగోదావరి ప్రజలు... 2019 వచ్చేసరికి వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన నిలిచారు. దాంతో, జిల్లాలోని మొత్తం మూడు పార్లమెంట్ స్థానాలతోపాటు, 14 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుని తిరుగులేని విజయం సాధించింది. మొత్తం 19 అసెంబ్లీ స్థానాల్లో 14 సీట్లను వైసీపీ ఎగరేసుకొనిపోతే, అప్పటివరకు అధికారంలో ఉన్న టీడీపీ కేవలం 4 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అయితే, రాష్ట్రంలో అయితే వైసీపీ అధికారంలోకి వచ్చింది కానీ, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు... ఇప్పటికీ టీడీపీలో చేతిలోనే ఉన్నాయి. దాంతో, ఆయా కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో ఇప్పుడు రాజకీయ ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు... దాదాపు అందరూ వైసీపీ వాళ్లే కావడంతో... టీడీపీ మేయర్లను, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులను వేధింపులకు గురిచేస్తున్నారట. ముఖ్యంగా కాకినాడ కార్పొరేషన్ లో తీవ్ర స్థాయిలో పోరు నడుస్తోందట. కాకినాడ మేయర్ ను దాదాపు డమ్మీగా మార్చేసి... కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల్లో... తన మాటే చెల్లుబాటు అయ్యేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారట. దాంతో, కాకినాడ మేయర్... సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి మధ్య వార్ నడుస్తోందట.

సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అంటూ హోరాహోరీగా తలపడ్డాయి. అయితే, వైసీపీ కేవలం 10 డివిజన్లకే పరిమితంకాగా, తెలుగుదేశం కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. కానీ, అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో... పలువురు టీడీపీ కార్పొరేటర్లు వైసీపీ పంచన చేరారు. దాంతో కాకినాడ కార్పొరేషన్లో సమీకరణలు, బలాబలాలు మారిపోయాయి. అదేసమయంలో మేయర్ పావనిని అధికార పీఠం నుంచి దించేందుకు వైసీపీ పావులు కదిలింది. అయితే, నాలుగేళ్లు వరకు మేయర్ ను దించకుండా జీవో ఉండటంతో వైసీపీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ, కార్పొరేషన్లోనే ఎక్స్ అఫీషియో పేరుతో ఒక ఛాంబర్ ను ప్రారంభించి, మరో అధికార కేంద్రానికి శ్రీకారం చుట్టారు వైసీపీ నేతలు. రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేనివిధంగా, తొలిసారి కార్పొరేషన్లో ఎమ్మెల్యేలకు ఒక ఛాంబర్ ఏర్పాటు చేయడం.... ఇక్కడ్నుంచే ఎమ్మెల్యేలు... మున్సిపల్ అధికారులతో, కార్పొరేటర్లతో తరచూ సమావేశమవుతూ... మేయర్ డమ్మీగా మార్చేశారు. ఇక, అధికారులంతా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఆదేశాలనే పాటిస్తుంటంతో మేయర్ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తానికి అటు కార్పొరేటర్లను... ఇటు అధికారులను తనవైపు తిప్పుకుని... మేయర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న వైసీపీ... ముందుముందు ఇంకెన్ని అరాచకాలు చేస్తుందోనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.