కనిపించని కడియం శ్రీహరి.. ఓరుగల్లు మునిసిపల్ ఎన్నికల సందడిలో ఆయన మిస్!

రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభ వెలిగి పోవటంతో అన్ని పార్టీల నుంచి గులాబిదళంలో భారీగా వలసలు కొనసాగాయి. దీంతో కారు పార్టీ కిక్కిరిసిపోతోంది. ఈ పరిణామమే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని టిఆర్ఎస్ సీనియర్ నేతలను టెన్షన్ పెడుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలు అంతర్గతంగా ఎలాంటి రాజకీయాలు చేస్తారనే వారి ఆందోళనకి ప్రధాన కారణం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరగబోతున్న మున్సిపోల్స్ అన్ని పార్టీల సీనియర్ లకి అగ్ని పరీక్షగా మారాయి. ఆయా పార్టీల అధిష్ఠానలేమో గెలుపు బాధ్యతలను ముఖ్య నేతల భుజస్కంధాలపై మోపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని చోట్ల గెలవాల్సిందేనని ముఖ్య మంత్రి కేసీఆర్, టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఆయా నియోజకవర్గానికి ఇన్ చార్జిలను నియమిస్తూనే ఇతర సీనియర్ నేతలకు కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. 

ఈ జిల్లా నుంచి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ,సత్యవతి రాథోడ్ ల పై కూడా కీలక భారం మోపారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ ,డోర్నకల్, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీలున్నాయి .తొర్రూరు మునిసిపాలిటీ మంత్రి దయాకర్ రావు పరిధిలోకి వస్తుంది కాబట్టి అయనకి ఆ బాధ్యతలు ఇచ్చారు. ఇక మహబుబాబాద్ డోర్నకల్ మరిపెడ బాధ్యతులు మంత్రి సత్యవతి రాథోడ్ ,మాజీ మంత్రి డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్, ఎంపీ కవిత ఎన్నికల ఇంచార్జ్ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ లకు అప్పగించారు. వీరిలో అందరి కంటే ఎక్కువ బాధ్యత వహించాల్సింది మాత్రం సత్యవతి రాథోడ్, రెడ్యా నాయక్ లే ఎందుకంటే వీరిద్దరూ జిల్లాలో సీనియర్ నేతలు మరోవైపు మహబూబాబాద్ జిల్లాలోని మున్సిపాల్టీలు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నా లోగుట్టు వేరే ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే సీనియర్ నేతలను ఈ పరిణామాలు బీపీ పెంచుతున్నాయి. దీంతో స్థానిక టీఆర్ఎస్ నేతలు మూడు ముక్కలుగా విడిపోయి ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా గెలుపు బాధ్యతలు అప్పగించారు. దీంతో అక్కడ ఎవరి విజయాలు వారివే అన్నట్టు పరిస్థితి తయారైంది. దీనికి తోడు ఈ మున్సిపాలిటీలో ప్రత్యర్థులు కూడా బలంగానే ఉండడం గమనార్హం.

ఇక ములుగులో జడ్పీ చైర్మన్ జగదీష్ , భూపాలపల్లి లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి లకు మున్సిపోల్స్ లో గెలుపు బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. ఈ తరుణంలో టీఆర్ఎస్ నేతలు అందరి కంటే ప్రచారంలో ముందున్నారు. ప్రభుత్వం అధికారంలో ఉండగా పొరపాటున ఏదైనా జరిగితే పరువు పోతుందన్న టెన్షన్ ఆ నేతల్లో కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ అధిష్టానం కూడా తమ పార్టీ సీనియర్ లకు మున్సిపల్ బాధ్యతలు అప్పగించింది. ప్రధానంగా కొండా మురళి, సురేఖ దంపతులకు పరకాల భూపాలపల్లి మునిసిపాలిటీల బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలో వారు తమ పార్టీని గెలిపించుకునేందుకు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు.జనగామ బాధ్యతల్లో పొన్నా లక్ష్మయ్య కు, నర్సంపేట బాధ్యతలను దొంతి మాధవరెడ్డికి అప్పగించారు. ఇదిలా ఉంటే అధికార టీఆర్ఎస్ నేతలు మాత్రం ఎలాగైనా మున్సిపల్ బార్ లో పై చేయి సాధించాలని ఇందు కోసం అవసరమైతే సామదానభేద దండోపాయాలను ప్రయోగించాలని ఫిక్స్ అయ్యారు. ఒకవేళ కౌన్సిలర్ స్థానాలు తమకు తగ్గితే ఇతరులను నయానో భయానో తమ వైపు తిప్పుకోవాలని కూడా స్కెచ్ వేశారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపేమిటంటే టీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి ఎక్కడా కనిపించకపోవడం ప్రస్తుతం ఉమ్మడి ఓరుగల్లు టీఆర్ఎస్ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది.