కేకే లేఖపై అనుమానాలు... కార్మికులు ఒప్పుకుంటారా? లేక ప్రభుత్వం దిగొస్తుందా?

 

కె.కేశవరావు... ఉరఫ్‌ కేకే... టీఆర్ఎస్ అండ్ కేసీఆర్ కి వ్యూహకర్తగా పేరు. పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానకర్తగా చెప్పుకుంటారు. పాలకులకు, నాయకులకు సమన్వయకర్తగా అనుకుంటారు. అంతేకాదు పార్టీ సమావేశాలైనా... ప్రభుత్వ మీటింగులైనా... కేసీఆర్‌ పక్కన కేకే ఉండాల్సిందే. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కేకేకు అంతటి విలువ ఇస్తారు కేసీఆర్. పార్టీ జనరల్ సెక్రటరీగా, రాజ్యసభ ఎంపీగా కేకే మాటను సీఎం కేసీఆర్‌ ఎంతో గౌరవిస్తారు. కేకేను అంతే అభిమానిస్తారు కూడా. అంతేకాదు కేకే మాటను అంత తేలిగ్గా తీసేసే పరిస్థితే లేదు. అలాంటి కేకే... అటు కార్మికులను, ఇటు పాలకులను ఉద్దేశిస్తూ రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

ఎందుకంటే, కార్మికుల ఆత్మహత్యలు తనను తీవ్రంగా బాధించాయన్న కేకే... పరిస్థితి మరింత చేయి దాటకముందే సమ్మె విరమించాలని, అలాగే చర్చలకు సిద్ధంగా కావాలని కోరారు. అయితే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రతిపాదన తమ అజెండాలో ఎక్కడా లేదన్న కేకే... ప్రభుత్వరంగ సంస్థల విలీనమంటే విధివిధానాలు మార్చుకోవాలని కోరడమేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రే తేల్చిచెప్పిన తర్వాత సమ్మె కొనసాగింపు ఎవరికీ ఆమోదయోగ్యం కాదన్నారు. అదే సమయంలో ఆర్టీసీ విలీనం మినహా మిగత డిమాండ్లను పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు కేకే. ఆర్టీసీ కార్మికుల సమస్యలను టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ...గతంలో గొప్పగా పరిష్కరించిందన్నారు. ఎక్కడా లేనివిధంగా 44 శాతం ఫిట్‌మెంట్‌, 16 శాతం ఐఆర్‌ ప్రకటించిన సీఎం కేసీఆర్‌... కార్మికులకు ఇచ్చిన వరాలంటూ ప్రశంసలు కురిపించారు.

అయితే, కేకే మధ్యవర్తిత్వాన్ని స్వాగతిస్తున్నామంటూనే... కేకే లేఖ, మంత్రుల కామెంట్లపై ఆర్టీసీ కార్మిక సంఘాలు మండిపడుతున్నారు. పెద్ద మనిషి తరహాలో కేకే చర్చలకు ఆహ్వానించడం మంచి పరిణామమే అయినా... విలీనంపై పక్కా హామీ ఇస్తేనే ముందుకొస్తామని కుండబద్దలు కొట్టారు. మరి, కేకే మధ్యవర్తిత్వంతో సమ్మె విరమించేందుకు కార్మికులు ఒప్పుకుంటారో లేక ప్రభుత్వమే మరో మెట్టుదిగి విలీనానికి ఒప్పుకుంటుందో చూడాలి.