బెయిల్ అడిగాడు..జైలుకు పొమ్మన్న సుప్రీం

దేశవ్యాప్తంగా న్యాయమూర్తులు, న్యాయవాదులపై అవినీతి ఆరోపణలు ఎదుర్కొని సుప్రీంకోర్టుకే సవాలు విసిరిన కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ జైలుకు వెళ్లాల్సిందేనని సుప్రీం తేల్చిచెప్పింది. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ జస్టిస్ కర్ణన్ వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆయన జైలు శిక్షను సస్పెండ్ చేసేది లేదని..కర్ణన్ ఆరు నెలల జైలు శిక్షను అనుభవించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థపై కర్ణన్ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన సుప్రీం తన ముందు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. సుప్రీం ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది..ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో కర్ణన్‌కు ఆరు నెలలు శిక్ష విధిస్తూ..సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు తీర్పు వెలువడిన కొద్ది సేపట్లోనే ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కర్ణన్‌ ఆచూకీ కోసం కోల్‌కతా, చెన్నై పోలీసులు తీవ్రంగా గాలించినప్పటికీ..ఫలితం లేదు..చివరకు నిన్న సాయంత్రం కోయంబత్తూరులో ఆయనని అరెస్ట్ చేశారు.