సుప్రీంకు చేరిన తెలంగాణ సచివాలయం వ్యవహారం

తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. సచివాలయం నిర్మాణంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని జీవన్‌ రెడ్డి పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. 

మరోవైపు, సచివాలయ భవనాల కూల్చివేత పనులను తాత్కాలిక బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. నూతన సచివాలయ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో లేదో.. ప్రభుత్వం చకచక ప్రస్తుత సచివాలయ భవనాల కూల్చివేత మొదలుపెట్టింది. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ కరోనా కష్టకాలంలో పాత భవనాల్ని కూల్చి రూ.500 కోట్లతో కొత్త భవనాలు కట్టడం అవసరమా అని ప్రశ్నించాయి. ఈ కూల్చివేతలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో, సోమవారం వరకు కూల్చివేత చేపట్టొద్దని హైకోర్టు అదేశాలు జారీ చేసింది.

అయితే ఇప్పటికే సచివాలయ భవనాల కూల్చివేత పనులు 50 శాతం పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో కూల్చివేత ఆపాలని హైకోర్టు, సుప్రీంకోర్టులలో పిటిషన్లు ధాఖలు కావడం ఆసక్తికరంగా మారింది. మరి ఈ అంశంపై కోర్టులు ఎలా స్పందిస్తాయో చూడాలి.