కుమారస్వామి పదవి ఎన్నాళ్లుంటుందో!

 

కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ కూటమి తరపున కుమారస్వామి ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దేశంలోని ప్రాంతీయ పార్టీల ముఖ్యులంతా సంబరపడిపోతున్నారు. కానీ ఈ సంబరాలు ఎన్నాళ్లు నిలుస్తాయన్నదే అసలు ప్రశ్న. అందుకు కుమారస్వామే కారణం. అధికారం కోసం ఎలాంటి ఎత్తుగడకైనా సిద్ధపడతారన్నది కుమారస్వామి మీద ఉన్న ఓ ఆరోపణ. ఆయన గతాన్ని చూస్తే, ఈ ఆరోపణని ఏమంత తేలికగా కొట్టి పారేయలేం అనిపిస్తుంది.

2004లో కర్ణాటకలో మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటిలాగానే అది కూడా జేడీఎస్- కాంగ్రెస్ పొత్తుతోనే ఏర్పడింది. ఆ ప్రభుత్వంలో భాగంగా ఉన్న కుమారస్వామి తన తండ్రిని సైతం కాదని 2006లో ప్రభుత్వాన్ని కూలదోశాడు. అంతటితో ఊరుకోలేదు. బీజేపీతో కలిసి మరో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు. ఆ ప్రభుత్వంలో జేడీఎస్ తరపున 20 నెలలు కుమారస్వామి, 20 నెలలు బీజేపీ తరపున యడ్యూరప్ప ముఖ్యమంత్రులుగా ఉండాలన్నది ఒప్పందం. కానీ తన పదవీకాలం ముగియగానే, ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకునేందుకు కుమారస్వామి ఒప్పుకోలేదు. ఆ నిర్ణయమే 2014 ఎన్నికలలో బీజేపీకి లాభించి యెడ్యూరప్పను ముఖ్యమంత్రిగా నిలబెట్టింది.

కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠం మీద ఇంత మోజు ఉండబట్టే కాంగ్రెస్‌ పార్టీ తనకు ఎక్కువ సీట్లు వచ్చినా కూడా అతనికే సీఎం పదవిని వదులుకుంది. ఇక సిద్ధరామయ్యతో కూడా కుమారస్వామిది ఉప్పూనిప్పూ వ్యవహారమే! ఒకప్పుడు సిద్ధరామయ్య దేవగౌడకి వీరవిధేయుడిగా ఉంది అన్ని సందర్భాలలో చేదోడుగా నిలిచాడు. కానీ కుమారస్వామి రాకతో అతని ప్రాధాన్యత తగ్గిపోవడమే కాకుండా పార్టీ నుంచి కూడా వెలివేయబడ్డాడు. ఎన్నికల ముందు వరకూ సిద్ధరామయ్య కుమారస్వామి మీదా, కుమారస్వామి సిద్ధరామయ్య మీదా నిప్పులు చెరిగారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇంకోవైపు బీజేపీ కూడా కుమారస్వామి ప్రభుత్వాన్ని ఎలాగొలా అస్థిరపరచాలనే ఆలోచనలో ఉండక మానదు. మోదీ- షా ద్వయం తమకు జరిగిన గర్వభంగాన్ని అంత తేలికగా మర్చిపోతారనుకోలేం. ఇన్ని పడగల నడుమ కుమారస్వామి ప్రభుత్వం నిండు ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపించగలదా అన్నదే కోటి రూపాయల ప్రశ్న!