ప్రతీకార వాంఛనే పరమావధిగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది

జేసే దివాకర్ రెడ్డి..ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.. అనంతలోనే కాదు రాష్ట్ర రాజకీయం గురుంచి మాట్లాడే ప్రతి ఒక్కరికి సుపరిచితుడు. ఆయన రాజకీయంతో పాటు అనేక వ్యాపారాలు చేస్తారు.. అందులో ట్రావెల్స్ ఒకటి. ట్రావెల్స్ వ్యాపారం కొంత కాలం ఆపేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. ఎందుకంటే తాజాగా ఆర్టీఏ అధికారులు దివాకర్ ట్రావెల్స్ బస్సులపై దాడులు చేసి బస్సులను సీజ్ చేశారు. బస్సులు, ఇతర ఆస్తుల విషయంలో తనపై అనేక ఒత్తిళ్లు తెస్తున్నారని  ఆయన తెలిపారు. తన బస్సులను సీజ్ చేసిన  అధికారులపై ఎదురు కేసులు పెట్టగా.. వాళ్లు  చివరికి కాళ్లబేరానికి వస్తున్నారని.. ఎందుకు చేసారంటూ నిలదీస్తే పై అధికారుల నుండి ఒత్తిడి ఉందని చెబుతున్నారని అన్నారు.

రోజు ఈ కేసుల గొడవ ఎందుకు కొన్నాళ్లు ట్రావెల్స్ నిలిపివేస్తే ప్రశాంతంగా ఉంటుందనుకుంటున్నానని దివాకరరెడ్డి చెప్పారు. జగన్ ప్రభుత్వం ప్రతీకారవాంఛ తీర్చుకొనేందుకే ఉన్నట్లు అయ్యిందని జేసీ విమర్శించారు. ప్రత్యర్ధులను హింసించేటప్పుడు అధికారం ఎన్నటికీ శాశ్వతం కాదన్న విషయం గుర్తు పెట్టుకోవాలని జేసీ హితవు పలికారు.  కృష్ణ జిల్లా నేత వల్లభనేని వంశీ పార్టీ మారటం పై మాట్లాడుతూ.. వంశీ ఎమ్మెల్యేగా తెలుసు కానీ ప్రత్యేకంగా అతనితో అనుబంధమేమి లేదన్నారు. వంశీ ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ‘పార్టీ నుంచి బయటకు వెళ్లే సమయంలో నాదేం తప్పు లేదు.. మొత్తం అవతల వారిదే తప్పని ఓ రాయి వేసి పోతారని అన్నారు.తనపై పార్టీ మరాలని ఒత్తిడి ఏమీలేదని.. ఇటీవల ఒక పెద్దాయన కనపడి ఒకసారి వెళ్ళి జగన్ తో మాట్లాడి రమ్మని సలహా చెప్పాడన్నారు. తాను ఆయన ఇంటికెళ్లి ఏమీ మాట్లాడనని.. జగన్ ఎక్కడైనా కనిపిస్తే మంచి చెడూ మాట్లాడతాను అని దివాకర రెడ్డి చెప్పారు. ఇప్పటికే తన ట్రావెల్స్ కు చెందిన బస్సులను సీజ్ చేశారని జేసీ గుర్తు చేశారు.