చెయ్యి ఎత్తమంటే ఎత్తాలి.. దించమంటే దించాలి..

 

ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు.. ఈ రోజు ఉదయం ఏపీ ఎంపీలతో రైల్వే ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్ల ప్రతిపాదనలపై  చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జేసీ.. సమావేశంలో గతంలో తామిచ్చిన రైల్వే ప్రతిపాదనలనే ఎంపీలంతా మరోసారి ప్రశ్నించామన్నారు. " రైల్వే జోన్ విషయంలో ఎంపీలు ఏమీ చేయలేరు. చెయ్యి ఎత్తమంటే ఎత్తాలి.. దించమంటే దించాలి. అంతకు మించి ఏమీ చేయడానికి లేదు. ఎంపీలు అంటే కరివేపాకు. రైల్వే జోన్‌పై చెప్పాల్సింది ప్రధానీ నరేంద్ర మోదీనే. అవసరం, సందర్భాన్ని బట్టి సీఎంకు ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మనిషికి కొంచెం భయం ఉంటేనే అన్నీ వస్తాయని భయం లేకపోతే ఆ వ్యక్తిలో విచ్చలవిడితనం పెరిగిపోతుంది" అని ఎంపీ జేసీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.