తెరపైకి జయలలిత కోడలు....శశికళకు నష్టమేనా..?


తమిళనాట రాజకీయాలు రోజు రోజుకి మరింత వేడిగా తయారవుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం రాజకీయాలు రోజుకో మలువు తిరుగుతున్నాయి. రోజుకొకరి పేరు బయటకు వస్తుంది. నిన్నటికి నిన్న సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే తాను అడ్డుకుంటానని శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు గాను రాష్ట్రంలో పలు చోట్ల రజనీకాంత్ అభిమానులు శరత్ కుమార్ కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమాన సంఘాలు డిమాండ్ చేశాయి. ఇప్పుడు మరో అంశం తెరపైకి వచ్చింది. అది జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లు దీప రూపంలో. ఇప్పటికే దీప పలుసార్లు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు  త‌న రాజ‌కీయ అరంగేట్రంపై ప్ర‌క‌ట‌న చేయ‌నున్న నేపథ్యంలో మరోసారి వార్తల్లో నిలిచారు. అంతేకాదు ఆమె ప్రకటన కోసం రాష్ట్రం మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది. ఇప్పటికే టీన‌గ‌ర్‌లోని ఆమె నివాసం ముందు అభిమానులు కిక్కిరిసిపోతున్నారు. రోజూ వేలాదిమంది అభిమానులు ఆమెను క‌లుసుకుని రాజ‌కీయాల్లోకి రావాల‌ని కోరుతున్నారు. కొంద‌రైతే సేలం జిల్లాలో దీప పేరుతో  పార్టీని స్థాపించ‌డ‌మే కాకుండా స‌భ్యత్వ న‌మోదు కూడా చేస్తున్నారు.

 

ఇదిలా ఉండగా దీప రాక మాత్రం అన్నాడీఎంకే పార్టీలోనే కొంత మంది నేతలకు ఆనందానిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా శశికళకు కాస్త వ్యతిరేకంగా ఉన్న నేతలకు.  జ‌య మ‌ర‌ణం త‌ర్వాత పార్టీ ప‌గ్గాలు చేపట్టిన శ‌శిక‌ళ‌కు వ్య‌తిరేకంగా ఓ వ‌ర్గం పార్టీలో ఉండ‌లేక‌, అలాగ‌ని బ‌య‌ట‌కు వెళ్లలేక సతమతమవుతోంది. ఇప్పుడు వీరికి దీప ఆశాకిర‌ణంగా క‌నిపిస్తున్నారు. అమ్మ‌లేని లోటును తీర్చాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి దీప ఎలాంటి ప్రకటన చేస్తారో తెలియాలంటే అప్పటి వరకూ ఆగాల్సిందే.