పవన్ కళ్యాణ్ కలుస్తానంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు: బీజేపీ ఎంపీ జీవీఎల్

 

తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను స్వాగతించారు బిజెపి ఎంపీ జీవిఎల్. పవన్ విలీన ప్రతిపాదనతో వస్తే అహ్వానిస్తామన్నారు. ఎన్నికల ముందు విలీనం చేయాలని కోరితే అంగీకరించేది లేదని తెలిపారు. బీజేపీతో కలిసి పని చేయాలనుకుంటే ప్రాంతీయ పార్టీల విలీనాన్ని స్వాగతిస్తామని చెప్పారు ఎంపీ జీవీఎల్.

పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ దేశంలో మత సామరస్యం లేకపోవటానికి హిందువులే కారణమని.. ఏ గొడవలు జరిగినా అందుకు హిందూ నాయకులే కారణమని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేవలం హిందువులే కారణమని చెప్పడం వెనుక తప్పనిసరిగా రాజకీయ దురుద్దేశం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని.. భవిష్యత్తులో ఇటువంటి తప్పు చేయనని ప్రజలకు భరోసా ఇవ్వాలని జీవీఎల్ వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తానెప్పుడూ భారతీయ జనతా పార్టీతో విభేదించలేదని.. బీజేపీతోనే కలుసుకున్నానని చెప్పారన్నారు. అదే విధంగా టిడిపి నాయకులు కూడా ఈ మధ్య అటువంటి వ్యాఖ్యలే చెబుతూ.. అమిత్ షా గారంటే చాలా గౌరవమని అంటూనే ఆ నాయకులే రాళ్లు వేయించారని ఆరోపించారు. గుండె మార్పిడి జరిగిందో ఏమో గాని  కొత్తగా వినసొంపు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.  

భారతీయ జనతా పార్టీ విధి విధానాలతో ఏకీభవిస్తే.. ప్రాంతీయ పార్టీలు ఏవైనా విలీనం చేయదలచుకుంటే  స్వాగతిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని మాతో  కలిసి పనిచేయమని.. జనసేనను బీజేపీలో విలీనం చేయమని ఎన్నికల ముందే ఆయనను అడిగామని కానీ ఆయన దానికి ఒప్పుకోలేదన్నారు. ఇప్పటికైనా మనసు మారి జనసేనను భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే ఆలోచన గనుక ఉంటే తప్పని సరిగా దాన్ని స్వాగతిస్తామని జీవీఎల్ స్పష్టం చేశారు.