జగన్ బాటలో జనసేనాని... అక్టోబర్ నుంచి యాక్షన్ ప్లాన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్... ఈ పేరు చెబితే చాలు తెలుగు యువత అభిమానంతో ఊగిపోతారు... గెలుపోటములకు అతీతంగా పవన్ వస్తున్నాడంటే చాలు...తండోపతండాలు తరలివస్తారు... పవన్ కల్యాణ్ కూడా ఏమాత్రం నిరాశపర్చడు... ఆలోచనలు రేకెత్తించే పంచ్ డైలాగులతో యువతలో అగ్నిని రాజేస్తాడు... తన మాటలతో ఆలోచింపజేస్తాడు... నిజమే కదా అనేలా చేస్తాడు... కానీ పవన్ ను ప్రజలు నమ్మడం లేదు... అందుకు రుజువు మొన్నటి ఎన్నికలే... పవన్ తాను పోటీచేసిన రెండు చోట్లా ఓడిపోవడం... 138 అసెంబ్లీ స్థానాలకు పోటీచేస్తే... ఒకే ఒక్క స్థానాన్ని స్వల్ప తేడాతో గెలుచుకోవడం... మొత్తంగా 6.78శాతం ఓట్లను మాత్రమే సాధించడం చూస్తుంటే... పవన్ ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నాడనే స్పష్టంగా తెలుస్తోంది. అయితే, తనను అభిమానించేవాళ్లు కోట్లాది మంది ఉన్నా... ఎన్నికల దగ్గరకి వచ్చేసరికి ఎందుకు ఓట్ల రూపంలో మారడం లేదంటూ విశ్లేషించుకున్న పవన్.... ప్రజల మనసులను గెలుచుకోవడానికి సంచలన నిర్ణయం తీసుకున్నారనే మాట వినిపిస్తోంది.

ముఖ్యంగా, క్షేత్రస్థాయిలో ఏమాత్రం బలం లేకపోవడం వల్లే ఘోరంగా ఓడిపోయామని అంచనాకి వచ్చిన పవన్, 2024నాటికి జనసేనను తిరుగులేని శక్తిగా మార్చాలని, యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. జగన్ తరహాలో ఏదోఒక ఇష్యూతో నిత్యం జనంలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్లపాటు ప్రజల్లో తిరుగుతూ, గ్రౌండ్‌ లెవల్లో జనసేనను శక్తివంతం చేయాలని సంకల్పించారట. ముఖ్యంగా వైఎస్, బాబు, జగన్ తరహాలో పాదయాత్ర చేయాలని డిసైడయ్యారట. ఎలాగైతే పాదయాత్ర చేసి, జగన్‌ అధికారంలోకి వచ్చారో, తాను కూడా జనంలోనే ఉంటూ, పాదయాత్రతో జనంతో మమేకంకావాలని పవన్‌ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవల మీటింగ్ లో జగన్ పాదయాత్రను మెచ్చుకున్న పవన్... తాను కూడా పాదయాత్ర చేయాలని ఉందని చెప్పారట. జగన్మోహన్ రెడ్డి కష్టపడ్డారు కాబట్టే ఇంతటి మెజార్టీ వచ్చిందని, మనం కూడా ప్రజల్లోకి వెళ్లి పనిచేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందన్నారట. అయితే, పవన్ పాదయాత్ర చేస్తే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పార్టీ నేతలు కూడా సూచించారట. దాంతో 2024 వరకు ఏదో ఇష్యూతో నిత్యం ప్రజల్లోనే ఉంటూ, ఎన్నికలకు రెండేళ్ల ముందు పాదయాత్రతో రాష్ట్రమంతా చుట్టేయాలని పవన్ ఇప్పట్నుంచే పక్కా ప్రణాళిక రూపొందించుకుంటున్నట్లు తెలుస్తోంది.