తెలంగాణలో ఎవరికి ఓటెయ్యాలో చెప్పిన పవన్ కళ్యాణ్

 

తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోటీకి జనసేన దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో జనసేన మద్దతు ఏ పార్టీకి? అంటూ చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 'కర్ర విరక్కూడదు.. పాము చావకూడదు' అన్నట్టుగా సమాధానం చెప్పారు.

ప్రస్తుతం టీఆర్ఎస్, ప్రజకూటమి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ఒకవేళ పవన్ టీఆర్ఎస్ కి మద్దతిస్తే.. టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ, జనసేన ఈ నాలుగు పార్టీలు ఒకటే అంటూ వస్తున్న ఆరోపణలు నిజమనుకునే ప్రమాదముంది. పోనీ ప్రజకూటమికి మద్దతిస్తే ఆ కూటమిలో టీడీపీ ఉంది. ఓ వైపు ఏపీలో టీడీపీ మీద విమర్శలు చేస్తూ.. తెలంగాణలో టీడీపీ ఉన్న కూటమికి మద్దతిస్తే ప్రజలకు సంకేతాలు వెళ్తాయి. అందుకే పవన్ సింపుల్ గా ఏ పార్టీకి మద్దతు అని చెప్పకుండా.. నిజాయితీగా ఉండే అభ్యర్థులకు ఓటేయండని జనసైనికులకు పిలుపునిచ్చారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం.. తక్కువ సమయం ఉండటం వల్లే జనసేన పోటీకి దూరంగా ఉందని చెప్పిన పవన్.. ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ యువత ఈరోజు తెలంగాణను తెచ్చుగోగలిగిందని అన్నారు. తెలంగాణను ఇచ్చామని ఒకరు.. తెలంగాణను తెచ్చామని మరొకరు చెబుతున్నారని.. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి ఓటేయాలనే స్థితిలో ఉన్నారన్నారు. ఎవరైతే ఎక్కువ పారదర్శకతతో, తక్కువ అవినీతితో పాలన అందించగలరో ప్రజలందరూ ఆలోచించి వారికే ఓటేయాలని పవన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తన అభిమానులకు, జనసేన కార్యకర్తలకు సూచించారు.