జనసేన ఎమ్మెల్యే రూట్ మార్చారు.. పవన్ డైరెక్షనేనా?

 

జనసేన పార్టీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రూట్ మారినట్లు కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడంతో ఆయనకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. దీంతో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. అసెంబ్లీలో పవన్ గొంతుకై వినిపిస్తారు, పవన్ గొంతుకై ప్రశ్నిస్తారు అని భావించారంతా. కానీ రాపాక మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో సీఎం జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే, కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అని రాపాక వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో జన సైనికులే కాదు, సాధారణ జనాలు కూడా షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే రాపాక రూట్ మార్చారు. జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు.

తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రాపాక విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 60 రోజులకే ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని రాపాక పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని, దేశంలోనే ఏపీ చాలా వెనకబడి ఉందని రాపాక తెలిపారు. ప్రభుత్వం పాలనపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. కానీ ప్రభుత్వం ఆ పని చెయ్యకపోవటం వల్లే ఇప్పుడు వ్యతిరేకత వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని రాపాక ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇంతకాలం జగన్ ప్రభుత్వ పాలన విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయని రాపాక పవన్ ఇచ్చిన సూచనలతోనే తన పంధా మార్చుకున్నారనే భావన వ్యక్తమవుతుంది. ఇటీవల రాపాకతో సమావేశం అయిన పవన్ రాపాక కు పలు సూచనలు చేసినట్టు సమాచారం. అందుకే రాపాక రూట్ మార్చి జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మొదలు పెట్టారని తెలుస్తోంది.