జనసేనానికి పెద్ద తలనొప్పిగా మారిన ఉన్న ఒక్క ఎమ్మెల్యే!!

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అద్భుతాలు సృష్టించకపోయినా, ఎంతోకొంత ప్రభావం చూపుతుందని భావించారంతా. కానీ, జనసేన ఊహించని ఫలితాలు మూట గట్టుకొని చతికిల పడింది. ముఖ్యంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడంతో.. జనసైనికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు, ఫ్యాన్ గాలి బలంగా వీచినా, అధినేత పవన్ ఓడిపోయినా.. రాపాక వరప్రసాద్ మాత్రం రాజోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. జనసేన తరపున ఎన్నికైన తొలి ఎమ్మెల్యేగా జనసైనికుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే రాపాక చర్యలు మాత్రం అటు జనసేనానిని, ఇటు జనసైనికుల్ని కలవరపెడుతున్నాయి.

జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో.. అధినేత పవన్ తర్వాత రాపాకపైనే అందరి దృష్టి ఉంటుంది. కావున ఆయన జనసేన గొంతుని అసెంబ్లీలో బలంగా వినిపించడమే కాకుండా.. బయటకుండా తన చర్యలతో పార్టీకి లాభం చేకుర్చాలి. అయితే కొన్ని విషయాల్లో మాత్రం.. ఆయన చర్యలతో అధికార పార్టీ వైసీపీకి లాభం చేకూరుతోంది. దీంతో జనసేనాని మరియు జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు.

ఆ మధ్య బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాపాక మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ దేవుడంటూ ఆకాశానికి ఎత్తేసారు. కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే.. కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు  జగనన్న అని అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ మాటలు విని అధికార పార్టీలో ఉత్సాహం పెరిగితే.. జనసైనికులు మాత్రం తీవ్ర నిరాశకు లోనయ్యారు.

అయితే తాజాగా రాపాక చేసిన మరో పని కూడా జనసేన పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10వేల చొప్పున ఇచ్చేందుకు 'వైఎస్ఆర్ వాహనమిత్ర' పేరుతో జగన్ సర్కార్ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకాన్ని జగన్ ఇటీవల ఏలూరులో ప్రారంభించారు. అయితే తాజాగా ఈ పథకానికి సంబంధించి రాజోలులో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పినిపే విశ్వరూప్‌తో కలసి రాపాక పాల్గొన్నారు. అంతేకాదు మంత్రితో కలిసి జగన్ ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఈ ఘటన రాజీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా జనసైనికుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.

ఈ పాలాభిషేకం ఎపిసోడ్ తో రాపాక వైసీపీలో చేరబోతున్నారన్న ప్రచారం కూడా మొదలైంది. అయితే రాపాక మాత్రం అబ్బే అలాంటిదేం లేదని ఖండించారు. నిజానికి రాపాక వైసీపీలో చేరుతారనే ప్రచారం ఎన్నికల ఫలితాల తరువాత నుంచే మొదలైంది. అయితే రాపాక మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించారు. తాను వైసీపీలో చేరితే తన నెంబర్.. 152 అవుతుందని, అదే జనసేనలో ఉంటే తను నెంబర్ 1 గా ఉంటానని లాజిక్ చెప్పారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం కాస్త తగ్గినా.. ఆయన చర్యలు మాత్రం ప్రచారానికి ఊపిరి పోస్తున్నాయి. 

విపక్ష పార్టీ ఎమ్మెల్యేగా.. అధికార పార్టీ చేస్తున్న పనులను ప్రశంసించడంలో తప్పులేదు. కానీ మరీ అధికార పార్టీ కార్యకర్తలాగా.. సీఎంని దేవుడుతో పోల్చడం, సీఎం ఫోటోకి పాలాభిషేకం చేయడమే అసలు సమస్య. ఆయన చర్యలతో అటు జనసేనాని, ఇటు జనసైనికులు తలలు పట్టుకునేలా చేస్తున్నారు. మరి రాపాక ఇకనైనా తన తీరు మార్చుకుంటారో లేక కండువానే మార్చుకొని షాకిస్తారో చూడాలి.