వైసీపీ, జనసేన పొత్తు.. ఎవరికి నష్టం?

 

ఏపీలో ఎన్నికలకు ఇంకా సుమారు ఏడు నెలల సమయం ఉన్నా రాజకీయాలు మాత్రం అప్పుడే వేడెక్కాయి. దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల మీద దృష్టి పెట్టాయి. అధికార పార్టీ టీడీపీ నుండి.. వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ వరకు అన్ని పార్టీలు ప్రజలను ఆకట్టుకొనే పనిలో ఉన్నాయి. అయితే గత ఎన్నికలకు, రానున్న ఎన్నికలకు పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసాయి. టీడీపీ అధికారంలోకి వచ్చింది. తరువాత రాజకీయ పరిస్థితుల మూలంగా ఆ రెండు పార్టీలకు టీడీపీ దూరం కావాల్సి వచ్చింది.

ఏపీకి బీజేపీ అన్యాయం చేసింది, నమ్మించి మోసం చేసింది అంటూ టీడీపీ ఎన్డీయే నుండి బయటికొచ్చి బీజేపీ మీద పోరాడుతుంది. బీజేపీ కూడా అదేస్థాయిలో చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంది. ఈ రెండు పార్టీలు ఇప్పట్లో కలిసే అవకాశమైతే అసలు లేదు. ఇక జనసేన విషయానికొస్తే 2014 ఎన్నికల్లో పవన్ టీడీపీ కి మద్దతిచ్చారు కానీ తరువాత టీడీపీ కి దూరమై విమర్శలు గుప్పిస్తున్నారు. జనసేన కూడా టీడీపీతో కలిసే అవకాశం లేదు. అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగబోతుంది. తెలంగాణలో అక్కడి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మహాకూటమితో కాంగ్రెస్ కి దగ్గరైంది కానీ ఏపీలో ఆ పరిస్థితి లేదు. అదీగాక రాష్ట్ర విభజనతో ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందనే భావనతో ఏపీ ప్రజలు గత ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా కట్టపెట్టలేదు. ఇప్పుడు ప్రత్యేకహోదాతో కాంగ్రెస్ ప్లేస్ లో బీజేపీ వచ్చి చేరింది. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రత్యేకహోదాపై తొలి సంతకం అంటూ మళ్ళీ ఏపీలో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనా కాంగ్రెస్, బీజేపీలు వచ్చే ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేవనేది వాస్తవం. అయితే బీజేపీ మాత్రం ఈ విషయాన్ని అంగీకరించకుండా చంద్రబాబుని టార్గెట్ చేస్తూనే ఉంది.

 


ఇప్పుడు బీజేపీ, వైసీపీ, జనసేన అందరి కామన్ టార్గెట్ చంద్రబాబు. చంద్రబాబుని వచ్చే ఎన్నికల్లో ఓడించడమే వీరి ముందున్న ప్రధాన లక్ష్యం. పైకి ఈ మూడు పార్టీలు విడివిడిగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నా.. రహస్యంగా ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని.. బీజేపీ డైరెక్షన్లోనే జగన్, పవన్ పని చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టే జగన్, పవన్ కూడా కేవలం చంద్రబాబు ప్రభుత్వం మీదే విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు. దీంతో రహస్య పొత్తు అనే వార్తలకు బలం చేకూరుతుంది. అసలు తెరవెనుక ఏం జరుగుతుందో తెలిసే వరకు ఇవన్నీ ఊహాగానాలుగానే మిగిలిపోతాయి.

అయితే ఇన్నాళ్లు రహస్య పొత్తు అంటూ వార్తలు కాస్త త్వరలో వైసీపీ, జనసేన అధికార పొత్తు అంటూ వార్తలు మొదలయ్యాయి. జనసేనకు 25 సీట్లు కేటాయిస్తే వైసీపీతో పొత్తుకు పవన్ సిద్ధమంటూ ఈ మధ్య బాగా వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అసలు ఈ వార్తల్లో నిజమెంత?. ఏపీ ప్రజలు హోదా విషయంలో బీజేపీపై కోపంగా ఉన్నారు కాబట్టి వైసీపీ, బీజేపీతో అధికారికంగా పొత్తు పెట్టుకునే సాహసం చేయదు. ఇక జనసేన విషయానికొస్తే జనాల్లోకి నెగటివ్ వెళ్లే అవకాశమైతే లేదు. కానీ పొత్తు వల్ల ఇరు పార్టీలకు నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. జనసేన తో పొత్తు పెట్టుకుంటే వైసీపీ 25 సీట్లు త్యాగం చేయాలి. ఈ 25 స్థానాల్లో వైసీపీలో టికెట్ ఆశిస్తూ.. కొన్నేళ్లుగా పార్టీకోసం పని చేసినవారుంటారు. పొత్తులో భాగంగా మీకు టికెట్ దగ్గలేదంటే వారు అసంతృప్తితో పార్టీ వీడే అవకాశం ఉంది. దీనివల్ల అధికారం ఆశ ఏమో కానీ మొదటికే మోసం వస్తుంది. జనసేన పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రస్తుతానికైతే పార్టీ నాయకులతో కళకళలాడట్లేదు కానీ పవన్ వల్ల మంచి జరుగుతుంది, పవన్ రాజకీయాలను మార్చేస్తాడు అని నమ్మిన కొందరు యువత మాత్రం అండగా ఉన్నారు. అలాంటిది పవన్, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ లాంటి నేతతో చేతులు కలుపుతారా?. ఇది ఆయన్ని నమ్మిన యువత నమ్మకాన్ని వమ్ము చేసినట్టే అవుతుంది. అదీగాక ఇతను కూడా సాధారణ రాజకీయ నాయకుడే అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుంది. ఇది భవిష్యత్తుకి ప్రమాదంగా మారుతుంది. అంటే వైసీపీతో పొత్తు జనసేనకు నష్టమనే చెప్పాలి. దీనిబట్టి చూస్తుంటే తెరవెనుక ఏం జరుగుతుందో తెలీదు కానీ.. తెరముందు వైసీపీ, జనసేన కలిసే అవకాశాలు లేవనే చెప్పాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.