రాజధాని అడ్డుకుంటానన్న పవన్‌పై ప్రభావం… ‘వారిదే’నా!

ఈ మధ్యే ఏపీ సీపీఐ కార్యదర్శి ప్రకటించేశారు! రాబోయే ఎన్నికల్లో జనసేన, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తారట! ఇది పెద్ద న్యూస్ ఏం అవ్వలేదు. ఎందుకంటే, పవన్ ఎర్ర జెండా అభిమానం రహస్యమేం కాదు. తాను చిన్నప్పట్నుంచే కమ్యూనిస్టు భావజాలం గలవాడినని ఆయన బహిరంగంగానే చెప్పారు. అంత వరకూ సంతోషమే! కానీ, పవన్ కమ్యూనిజానికి ప్రతినిధులుగా భారతదేశ సీపీఐ, సీపీఎంలని ఎంచుకున్నారు! అదీ ఏపీ కొడవలి పార్టీల్ని అక్కున చేర్చుకున్నారు. ఇది పవన్ రాజకీయ అవగాహనకి మచ్చు తునక అనవచ్చు!

 

 

జనసేన, కమ్యూనిస్టులు కలిశారు కాబట్టి ఇక టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీలది ఒంటరి పోరేనని మనం డిసైడ్ అవ్వొచ్చు. మరి కలిసి పోటీ చేస్తోన్న సీపీఎం, సీపీఐ, జనసేనలకి ఎవరికి ఎవరి వల్ల లాభం? ఇదే ఇప్పుడు హార్డ్ కోర్ పవన్ ఫ్యాన్స్ ను కూడా వేధిస్తోన్న విషయం! ఆయన మీద అభిమానంతో ఓటు వ్దేదామనుకున్న వారు కూడా ఇప్పుడు కమ్యూనిస్టు జెండాలు చూసి వెనక్కి తగ్గుతున్నారు. సీపీఎం, సీపీఐ ఒకప్పటిలా ధృఢంగా లేవన్నది అందరికి తెలిసిన విషయమే. పోయిన ఎన్నికల్లో ఖాతాలు కూడా తెరవలేకపోయాయి నవ్యాంధ్రలో. అటువంటి స్థితిలో వున్న కమ్యూనిస్టులతో పవన్ కు అవసరం ఏంటి? ఒకరో ఇద్దరో కమ్యూనిస్టు వ్యతిరేక ఫ్యాన్స్ వుంటే వారు ఈయనకు ఓటు వేయకపోవటం తప్ప మరో లాభం లేదు! సీపీఎం, సీపీఐలతో కలయిక వల్ల పవన్ కు లాభం కంటే నష్టం ఎక్కువని కాస్త గట్టిగానే చెప్పుకోవచ్చు. ఎలాగంటే… ఆ రెండు పార్టీలు దేశ్య వ్యాప్తంగా కూడా తుడిచి పెట్టుకుపోతున్నాయి. బెంగాల్ , త్రిపుర చేజారిపోగా , కేరళలో కాంగ్రెస్, బీజేపీలు సీపీఎంని ముప్పతిప్పలు పెడుతున్నాయి. కేరళల అధికారంపోతే కమ్యూనిస్టులకు ఎక్కడా సీఎం కుర్చీ వుండదు. అందుక్కారణం వారు చెప్పే కుందేటికి మూడు కాళ్ల సామెతే…

 

 

మన సీపీఎం, సీపీఐ పార్టీలు గొప్పగా చెప్పే చైనా కూడా కమ్యూనిజం పూర్తిగా మార్చేసుకుంది. కాలానుగుణంగా అమెరికాతో పోటీ పడేలా క్యాపిటలిస్టు ఆర్దిక విధానం నెత్తికెత్తుకుంది. అక్కడ పాలన, ఎన్నికల విధానాల్లో తప్ప కమ్యూనిజం ఎక్కడా కనిపించదు. కానీ, మన కమ్యూనిస్టులు మాత్రం ఇంకా మార్క్స్ , మావో సిద్ధాంతాలే మన గతి అంటూ చెబుతుంటారు. అవ్వి కూడా తమకు దశాబ్దాల తరబడి అధికారం ఇచ్చిన రాష్ట్రాల్లో నిజాయితీగా అమలు చేయలేదు. అందుకే, ప్రజలు వార్ని పక్కకు తోసి అభివృద్ధి, ఉద్యోగాలు చూపించే పార్టీలకు పట్టం కడుతున్నారు. బీజేపీ మొదలు టీడీపీ దాకా అన్నీ పార్టీలు ఉద్యమాలకు బదులు ఉద్యోగాలు అన్న నినాదంతోనే వరుసగా గెలుపులు స్వంతం చేసుకుంటున్నాయి. కమ్యూనిస్టులు మాత్రం అదే పాత పద్ధతిలో ప్రభుత్వ వ్యతిరేక జన ఆందోళనలే తప్ప మరో ఆలోచన చేయటం లేదు!

 

 

తమ పద్ధతులతో తామే నష్టపోతోన్న సీపీఎం, సీపీఐలని పవన్ అక్కున చేర్చుకున్నారు. పైగా వారి బాటలోనే తాజాగా కామెంట్స్ కూడా మొదలు పెట్టారు. అమరావతిలో కొంత మంది రైతుల కోసం వేల ఎకరాలిచ్చిన మిగిలిన అందరు రైతుల్ని నష్టపరిచేలా అమరావతి నిర్మాణం అడ్డుకుంటామని ప్రకటించారు. జనసేన అమరావతి నిర్మాణం అడ్డుకుంటుందా? అడ్డుకోగలదా? అన్నది తరువాతి ప్రశ్న! అసలు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం రాజధాని నిర్మాణం జరుకుంటుంటే ఆనందించాల్సింది పోయి ఏవో సమస్యల్ని  చూపి అడ్డుకుంటానని బెదిరించటం ఏంటి? ఇది పక్కా సీపీఎం, సీపీఐ మార్కు ఉద్యమాల రాజకీయం. ఒకప్పుడు ఆ మాటలు పని చేసేవే. కానీ, ఇప్పుడు జనం ఉద్యమాల కంటే ఉద్యోగాల కోరుకుంటున్నారు. ఆవి అమరావతి లాంటి భవ్యమైన రాజధాని వల్ల సాధ్యం. హైద్రాబాద్ వుండటం వల్లే ఇవాళ్ల తెలంగాణ ఎంత ఆర్దిక అభివృద్ధి సాధించిందో అందరికీ తెలుసు. మరి అటువంటి రాజధాని ఏర్పాటుకు, అభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తుంటే పవన్ బ్లాక్ మెయిలింగ్ ఏంటి? ఎవరో చెప్పుడు మాటలు విని ఇలా బాద్యతా రహితంగా మాట్లాడితే ఎలా? రాజధాని అడ్డుకుంటే ఆంధ్రప్రదేశ్ యువతకు జరిగే మంచేంటి?

 

 

ఎన్నికల్లో కలిసి పోటీ చేయటం, ఓట్లు, సీట్లు పంచుకోవటం వరకూ ఓకే కానీ… రాబోయే ముప్పై ఏళ్లు ప్రజా జీవితం గడుపుతానని అంటోన్న జనసేనాని… పూర్తిగా సీపీఎం, సీపీఐ మార్కు ఛాందస కమ్యూనిజం తలకెత్తుకుంటే ఇబ్బందే! ఆయనకు అంతగా కమ్యూనిజం నచ్చితే మన కమ్యూనిస్టులు కాక చైనా ఏం చేస్తుందో చూసి తెలుసుకోవాలి. అప్పుడు ఆ దారిలోనన్నా అభివృద్ధి, ఉద్యోగాలు అంటూ జనానికి భరోసా ఇవ్వచ్చు. అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ అభివృద్ధి నిరోధకంగా మారితే… బెంగాల్, త్రిపుర, కేరళలో సీపీఎం, సీపీఐలకు ఎదురవుతోన్న గడ్డు పరిస్థితే పవన్ కు తప్పక పోవచ్చు!