కేంద్రం అధీనంలోకి జమ్మూ కాశ్మీర్...అసలు ఏమి జరుగుతోంది ?

 

జమ్మూ కశ్మీర్‌లో క్షణ క్షణానికి పరిస్థితులు మారుతున్నాయి. నిన్న అర్ధరాత్రి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకుని హౌస్ అరెస్ట్ చేశారు. వారు గడప దాటి బయటకు రావద్దని ఆదేశించి పోలీసులను కాపలా ఉంచారు. రాష్ట్రమంతా 144 సెక్షన్ విధిస్తూ బహిరంగ సభలు, ప్రదర్శనలకు అనుమతి నిరాకరిస్తున్నారు. 

పలు జిల్లాల్లో ఆంక్షలు అమలుతో పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. కిష్టావర్‌, రాజౌరి, రాంబస్‌ జిల్లాల్లో కర్ఫ్యూ విధించగా, పలు జిల్లాల్లో ఆంక్షలు అమలుతో పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. శ్రీనగర్‌తో పాటు జమ్మూ, రెశాయ్‌, దోడా జిల్లాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. విద్యాశాఖ అధికారులు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. జమ్మూ విశ్వవిద్యాలయం పరిధిలో ఈరోజు జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేశారు. కాశ్మీర్‌ లోయలోని విద్యార్థులు హాస్టళ్లు ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు సూచించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఆదేశాలు అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. 

దీంతో అక్కడి పరిస్థితినంతా కేంద్రం తన గుప్పిట్లోకి తెచ్చుకున్నట్టయింది. ఇక ఇంత ఉద్రిక్త పరిస్థితుల నడమ ప్రధాని మోడీ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లతో పాటు పలువురు హాజరయ్యారు. కాశ్మీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. 

దీంతో  ఆర్టికల్‌ 35 ఏ, ఆర్టికల్‌ 370లను రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  అక్కడితో ఆగక దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పలుచోట్ల ఘర్షణలు జరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. దీంతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇక ఏమి జరగనుందో అనే టెన్షన్ కేవలం జమ్మూ కాశ్మీర్ వరకే కాక భారత్ మొత్తం నెలకొని ఉంది.