ఇది రెచ్చగొట్టడం కాదా పవన్ కళ్యాను ?

జల్లికట్టు వివాదంతో ఆంధ్రప్రదేశ్ ‘స్పెషల్ స్టేటస్’ ఇష్యు మరోసారి తెరపైకి వచ్చంది. తమిళుల జల్లికట్టు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలని నినాదాలు తెరపైకి వస్తున్నాయి. ఈ సంవాదాన్ని పరిశీలిస్తే.. జల్లి కట్టు తరహలో ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ సిఎం చంద్రబాబు పోరాడాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు లేఖ రాయడంతో ఈ లింకు తెరపైకి వచ్చిందనుకోవాలి. ఈ పోరాటంలో చంద్రబాబు రాష్ట్రానికి నాయకత్వం వహించాలని, ప్రత్యేక హోదా ఉద్యమానికి చంద్రబాబు నాయకత్వం వహిస్తే కనుక అన్నివర్గాలు ఆయనకు తోడుగా నిలుస్తాయని, చట్టవిరుద్ధమైన జల్లికట్టునే తమిళులు సాధించుకున్నారని, అలాంటిది చట్టబద్ధమైన హామీలను సాధించుకునే దమ్ము మనకు లేదా? అని ప్రశ్నిస్తూ.. నైస్ గా ఓ లెటర్ రాసి చంద్రబాబును ఓ కార్నర్ లోకి నెట్టేశారు కేవీపీ. 

 

ఇది పక్కా పొలిటికల్ లెటర్ అన్న సంగతి కాస్త పరిశీలిస్తే అర్ధమైపోతుంది. జల్లికట్టు పోరాటానికి ఏపీ స్పెషల్ స్టేటస్ కి లింకు పెట్టడమా? జల్లికట్టులో ఏముంది?  కేంద్రం ఒక అర్దినెన్స్ ఇవ్వాలి. మహా అయితే రెండు పేపర్లు, నాలుగు సంతకాలు. అక్కడితో తేలిపోతుంది లెక్క. కానీ స్పెషల్ స్టేటస్ అంటే కేంద్రానికి బోలెడు కరుసు. ఇంకెన్నో పొలిటికల్ ఎత్తుగడలు. ఏవేవో సమీకరణలు. ఇలా ఎంతో వైరుధ్యం వున్న రెండు అంశాలను ముడిపెట్టేశారిప్పుడు. అసల్ లాజిక్ లేదిక్కడ. కాని ఇక్కడ లాజిక్కులతో పనిలేదు. రాజకీయం రక్తికట్టించేయాలి. చిత్తశుద్ధి లేని నాయకులు చేసే ప్రకటనలు ఇలానే వుంటాయి అనుకోవాలి మరి. ఏపీకి అన్యాయం జరిగిన మాట వాస్తవం. హోదా హామీని తుంగలో తొక్కింది కేంద్రం. ఇప్పుడు కచ్చితంగా హోదాను సాధించుకోవాలి. దీని కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగాల్సిందే. అయితే దిన్ని జల్లికట్టు తో ముడిపెట్టెయడమే విచిత్రం. 

 

కేవీపీ లాంటి నాయకులు ఇంకా నయం. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్టాండ్ ఇంకా విచిత్రంగా వుంది. ‘’హోదా పై యువత పోరు బాట పడితే తాను మదత్తు ఇస్తానని, రాజకీయ నాయకులు రాజీపడొచ్చు ఏమో కానీ యువత ఊరుకోరని, యువతకు నా మద్దత్తు’’ అంటూ ట్విట్టర్ గేమ్ ఆడుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన మాటలు గమనిస్తే యువతను రెచ్చగొడుతున్నాడా? అనిపిస్తుంది. కేవీపీ నయం పోరాటం చేయాలని చంద్రబాబు కు ఓ సూచన చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో యువతపై భారం మోపుతున్నాడనిపిస్తుంది. ''ప్రజలు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. యువత రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి వద్దు. మీరు అధికారం ఇచ్చిన నాయకులే స్టేటస్ తెచ్చిపెట్టాలి'' అని గత సభల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఇపుడు 'ఎవరు ఊరుకున్నా యువత ఊరుకోదు' అనే నినాదాన్ని ఎత్తుకోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో పవన్ కల్యానే చెప్పాలి.