జల్లికట్టు మొండిపట్టు...

ఒకప్పుడు ఆపరేషన్స్  చేస్తే మత్తు మందు ఇచ్చేవారు. కాని, ఇప్పుడు శరీరం మొత్తానికి కాకుండా ఎక్కడైతే సర్జరీ అవసరమో అక్కడే మత్తు ఇస్తున్నారు. అయితే, దేశంలోని కొన్ని అభ్యుదయవాద సంస్థలు అదే పద్ధతి ఫాలో అవుతున్నాయి. కొన్ని అంశాల్లో ఉత్సాహంగా ఉద్యమాలు, నిరసనలు కొనసాగించే సదరు సంస్థలు మరి కొన్ని అంశాల్లో మాత్రం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తుంటాయి. తమకు ఇబ్బంది కలిగే చోట మత్తు మందు తీసుకున్నట్టు నిద్ర నటిస్తూ అభ్యుదయవాదం పక్కన పెట్టేస్తాయి. మిగతా చోట్ల మాత్రం అల్లరల్లరి చేసేస్తుంటాయి! జంతు ప్రేమికుల సంస్థ పెటానే ఇందుకు మంచి ఉదాహరణ!

 

ప్రపంచ వ్యాప్తంగా జంతువులపై జరిగే హింసని వ్యతిరేకించే పెటా అసలు వదిలి కొసరు పట్టుకునే వేలాడుతుంటుంది ఎప్పుడు. చక్కగా కార్పోరేట్ బిల్డప్ ఉట్టిపడేలా హీరోయిన్లతో హాట్ ఫోటోషూట్లు చేస్తూ హల్ చల్ చేస్తుంటుంది. మిగతా సమయాల్లో ఈ పెటా ఎక్కడా పెట్రేగిపోయినట్టు కనిపించదు. పెద్ద ఎత్తున జంతువుల్ని హింస నుంచి కాపాడిన వార్తలు కూడా పెద్దగా ఏం కనిపించవు. ఇక హిందువులు పవిత్రంగా భావించే గోవులు, మన రాజ్యాంగం తప్పక కాపాడబడాలని చెప్పినప్పటికీ కబేళాల్లో బలైపోతుంటాయి. వాటిని కూడా ఒక్కసారి ఈ పెటా వారు గుర్తించిన పాపాన పోరు.

 

పెటా, దాని లాంటి బోలెడు అంతర్జాతీయ సంస్థలు, చిన్నా, చితక ఎన్జీవోలు ఈ మధ్య రకరకాల ఉద్యమాల పేరుతో నానా హంగామా చేస్తున్నాయి. ఉదాహరణకి, ప్రతీ రోజూ బిర్యానీల కోసం జరిగే కోళ్ల వధ గురించి పట్టించుకోని సంస్థలు, ఉద్యమకారులు సంవత్సరానికి ఒకసారి జరిగే కోళ్ల పందాలపై మాత్రం దృష్టి పెడుతుంటారు. ఒక్క సంక్రాంతికే కాదు దాదాపుగా ఇండియాలో జరిగే ప్రతీ పండుగకి వీళ్లు ఏదో ఒక అభ్యంతరంతో బయలుదేరుతుంటారు. అయితే, కోర్టులకి వెళ్లటమో, లేదంటే ప్రచారాలతో జనాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేయటమో చేస్తుంటారు. ఒకవైపు భారీ పరిశ్రమలు భూమి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంటే దీపావళి వాయు కాలుష్యం గురించి గోల చేయటం ఇలాంటిదే.

 

ఇక్కడే పెటా లాంటి సంస్థలు తెలివిగా తప్పించుకునే మరో అంశం వుంది. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిమ్ జనాభాకి కోపం తెప్పించే ఉద్యమాలు, ప్రచారాలు వీరు అస్సలు చేయరు. మొహర్రం నాడు రక్తం చిందించ వద్దనో, బక్రీద్ నాడు జంతు హింస వద్దనో వీళ్లు పిలుపునివ్వరు. నిజానికి అది వారి మత విశ్వాసం. దాని గురించి మార్పు జరగాలంటే వారే నిర్ణయించుకోవాలి. కాని, ఇక్కడ సమస్య అభ్యుదయవాదం పేరుతో మన దేశంలో కొన్ని మతాలు, కొన్ని వర్గాల్నే టార్గెట్ చేయటం. అదీ జల్లికట్టు లాంటి పెద్దగా ప్రాణహాని లేని సంప్రదాయ క్రీడల్ని కూడా నిషేధింపజేయటం!

 

జల్లికట్టు విషయంలో పెటా వేసిన కేసు వల్లే నిషేధం వచ్చిపడిందని తమిళ ప్రజలు భావిస్తున్నారు. వారి కోపంలో అర్థం వుంది కూడా. అంతర్జాతీయంగా విస్తరించిన పెటా సంస్థ స్పెయిన్ లో జరిగే బుల్ ఫైట్ నిషేధించమని డిమాండ్ చేస్తుందా? అక్కడ జరిగేది జంతు హింస కాదా? కేవలం భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రమే ఇలాంటి హడావిడి చేయటం న్యాయమా? ఇలాంటి అనేక ప్రశ్నలకు అభ్యుదయ సంఘాల వద్ద సమాధనం లేదు. పైగా కొన్ని సందర్భాల్లో కోర్టులు కూడా వీరికి అనుకూలంగా తీర్పులు ఇవ్వటంతో పరిస్థితి మరింత జటిలంగా మారుతోంది. జనం అసహనంతో రోడ్లపైకి రావాల్సి వస్తోంది. సంప్రదాయం, సంస్కృతి, మతం వంటి విషయాల్లో పెటా లాంటి సంస్థల జోక్యాన్ని ప్రభుత్వాలు అరికట్టాలి. మీడియా కూడా హఠాత్తుగా పైకి లేచే ఉద్యమాలకి వెనుకా ముందు ఆలోచించుకుని సామాజిక బాధ్యతతో మద్దతు పలకాలి.

 

కేవలం టీఆర్పీల కోసం ఒకే మతం, ఒకే వర్గంపై అదే పనిగా బురదజల్లి మిగతా అందర్నీ మన్నించి వదిలేయటం సబబు కాదు. నిజంగా సమాజానికి చేటు చేసే ధోరణులు ఎక్కడైనా వుంటే జనం అర్థం చేసుకునేలా వాటి గురించి చెప్పాలిగాని ... తిట్టిపోసి, దబాయించి సంప్రదాయాన్ని మానివేయించటం అంత తేలిక కాదు. ప్రస్తుతం జల్లికట్టు విషయంలో తమిళ జనం మొండిపట్టుకి అదే కారణం. ప్రజల ఓపికకి కూడా హద్దులు వుంటాయి...