జల్లికట్టుపై సుప్రీం ఆగ్రహం... మాకు తెలుసు ఎప్పుడివ్వాలో..

 

తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై సుప్రీం కోర్టులో ఎప్పటినుండో వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ వస్తున్ననేపథ్యంలో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఎద్దులను హింసించి, రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారంటూ జంతు ప్రేమికులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో.. 2014 మే 7వ తేదీన జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. అయితే దీనిపై దివంగత ముఖ్యమంత్రి జయలలిత జల్లికట్టుపై నిషేధాన్ని తొలగించాలని కోరుతూ అనేకసార్లు కేంద్రానికి లేఖలు రాశారు. అప్పటి నుండి దీనిపై సుప్రీంకోర్టులో విచారణలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరోసారి తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జల్లికట్టుపై తీర్పు త్వరగా ఇవ్వాలని న్యాయవాదులు కోరగా, సుప‍్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పు విషయంలో ఇలా అడగడం భావ్యం కాదని, తీర్పు ఎప్పుడు ఇవ్వాలో తమకు తెలుసని ఘాటుగా వ్యాఖ్యానించింది. తమపై ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.