ముప్పై చోట్ల పేలుళ్లకు ప్లాన్ చేసిన జైషే మహమ్మద్...

 

భారత్ లో ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి కుట్ర పన్నారు, దేశ వ్యాప్తంగా ముప్పై చోట్ల పేలుళ్లకు ప్లాన్ చేశారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చేసిన ఈ కుట్రను ఇంటెలిజెన్స్ బ్యూరో పసిగట్టింది. జైషే మహమ్మద్ విడుదల చేసిన లేఖను ఐబీ కనిపెట్టింది. పాక్ భూభాగం లోని బాలాకోట్ లో ఉగ్రవాద శిబిరాలు మళ్లీ వెలిశాయని, మరోసారి దాడులకు సిద్ధంగా ఉన్నామని ఆర్మీ చీఫ్ ప్రకటించిన రెండు రోజుల్లోనే జైషే మహమ్మద్ కుట్ర బయటకు రావడంతో అందరూ అలర్ట్ అయ్యారు.

కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్ తీవ్రమైన కడుపు మంటతో ఉంది. భారత్ ని నేరుగా ఎదుర్కోలేకపోతున్న పాక్ ముష్కరులుని రెచ్చగొట్టి విధ్వంసాలకు కుట్ర చేస్తుందని సమాచారం. భారత్ లో భారీ విధ్వంసాలకు పాల్పడటమే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ని కూడా హిట్ లిస్ట్ లో పెట్టుకున్నామని, వారిని హత్య చేస్తామని జైషే మహమ్మద్ విడుదల చేసిన లేఖతో బయటపడింది. జైషే మహమ్మద్ చేస్తున్న ఈ కుట్రకు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ సహకారం అందిస్తున్నట్టు ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో కనిపెట్టింది.

ఆర్టికల్స్ 370 రద్దుతో కాశ్మీర్ లో పాకిస్తాన్ పప్పులుడికేలా పరిస్థితి కనిపించకపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉగ్రమూకల్ని రెచ్చగొడుతోంది. ఇప్పుడు జైషే మహమ్మద్ చేసిన కుట్ర కూడా కాశ్మీర్ పై ఉన్న కడుపుమంటే అని తెలుస్తుంది. ఐబీ కనిపెట్టిన జైషే మహమ్మద్ లేఖలో అనేక ఉగ్ర కుట్రకు సంబంధించిన లింక్స్ ఉన్నాయి. దేశంలో ముప్పై చోట్ల పేలుళ్లకు వేసిన ప్లాన్ లో గాంధీనగర్, కాన్పూర్, లక్నో ఎయిర్ పోర్ట్ లు కూడా ఉన్నాయి. ఈ మూడు ఎయిర్ పోర్ట్ లను పేల్చేయాలని పన్నాగం పన్నింది పాకిస్తాన్.

దీంతో ఇండియన్ ఇంటెలిజెన్స్ దేశవ్యాప్తంగా సెక్యూరిటీని అలర్ట్ చేసింది. జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినా పాకిస్థాన్ మాత్రం తన బుద్ధిని మార్చుకోలేదు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన తరువాత మసూద్ అజర్ ని అదుపులోకి తీసుకుని జైలులో పెట్టిన పాకిస్తాన్, సరిగ్గా నెల రోజుల క్రితం అతన్ని వదిలేసింది. మసూద్ అజర్ బయటకు రాగానే బాలాకోట్ లో మళ్లీ ఉగ్రక్యాంప్ లు మొదలయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన భారత ఆర్మీ రెండు రోజుల క్రితమే పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చింది. బాలాకోట్ లో జరుగుతున్న ఉగ్రవాద శిక్షిణా శిబిరాలపై మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరించింది.