కాంగ్రెసోళ్లు డిసైడైపోయారు

 

చూడబోతే కాంగ్రెస్ పార్టీ వాళ్లు పూర్తిగా డిసైడైపోయినట్లే కనిపిస్తోంది. ఏమిటంటారా.. అదే సీమాంధ్ర ప్రాంతంలో తమకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా అక్కర్లేదని, కనీసం డిపాజిట్లు కూడా దక్కాల్సిన అవసరం ఏమాత్రం లేదని, అంతేకాదు.. మరో దశాబ్ద కాలం పాటు అక్కడ పార్టీని కిలోమీటర్ల లోతున పాతేసుకోడానికి కూడా తమకు అభ్యంతరం లేదని వాళ్లు డిసైడైపోయినట్లే కనిపిస్తోంది. కేంద్రమంత్రి, తెలంగాణాపై కేంద్ర ప్రభుత్వం నియమించిన జీవోఎంలో కీలక సభ్యుడు, మన రాష్ట్రం కోటా నుంచి రాజ్యసభకు పదేపదే ఎంపికవుతూ వస్తున్న జైరాం రమేష్ మాటలు చూస్తుంటే అచ్చం అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే, సీమాంధ్రులను అత్యంత నీచాతి నీచంగా చిత్రీకరిస్తూ.. అదికూడా సొంత పార్టీ కార్యకర్తల ముందు, నాయకులు, కేంద్రమంత్రుల ముందు కూడా మాట్లాడటానికి సైతం ఆయన వెనకాడటం లేదు. గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి అడుగడుగునా తనకు ఎదురవుతున్న నిరసనలు చూసి తట్టుకోలేకపోయినట్లున్నారు.

 

సీమాంధ్రులను ఇలాగే వదిలేస్తే, చార్మినార్ లోని రెండు మీనార్లు కూడా కావాలంటారని ఆయన అన్నారు. రోజూ ఢిల్లీకి వచ్చి హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలంటూ అష్టోత్తరం, సహస్రం చదివేవారని ఎద్దేవా చేశారు. మరోవైపు టీఆర్ఎస్ తమలో విలీనం కాకపోయినా పర్వాలేదు.. కనీసం పొత్తయినా ఉంటే చాలు, ఎంతో కొంత మేర తెలంగాణా ప్రాంతంలో బతికి బట్టకడదామని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర పెద్దలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.