అమెరికాను కుదిపేసిన ఓ లెక్కల టీచర్‌

 

మన సంప్రదాయంలో గురువులకు ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పనే అక్కర్లేదు. గురువుని త్రిమూర్తులతో సమానంగా పూజిస్తాము. తల్లిదండ్రులతో సమానంగా భావిస్తాము. గురువుని ఆరాధించేందుకు మనకు పండుగలు ఉన్నాయి, సంప్రదాయాలూ ఉన్నాయి. వాటికి తోడుగా మన తెలుగువాడైన సర్వేపల్లి రాధాకృష్ణయ్య జన్మదినాన్ని గురుపూజా దినోత్సవంగానూ జరుపుకొంటున్నాం. కానీ గురువు ఎక్కడైనా గురువే కదా! ప్రపంచంలోని ప్రతిభావంతులైన గురువులను తెలుసుకోవడం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. వారిలో ఒకరి పేరే జైమ్‌ ఎస్కలాంట్!

 

బొలీవియా టు అమెరికా:

ఎస్కలాంట్ బొలీవియాకు చెందిన ఒక ఉపాధ్యాయుల కుటుంబంలో పుట్టాడు. ఆ నేపథ్యం వల్లనో ఏమో అతనికి చిన్నప్పటి నుంచే బోధన అంటే చాలా ఇష్టంగా ఉండేది. లెక్కల్లో తమ పూర్వీకులు గ్రీకులకు తీసిపోరన్నది ఎస్కలాంట్‌ నమ్మకం. ఆ నమ్మకంతోనే తను కూడా లెక్కల మీద మంచి పట్టుని సంపాదించాడు. తండ్రి తాగి తాగి చనిపోయినా, కుటుంబం పేదరికంలో కూరుకుపోయినా... ఎస్కలాంట్‌లోని ప్రతిభ మాత్రం చెక్కుచెదరలేదు. రకరకాల ఉద్యోగాలు చూస్తూనే బోధనలో పట్టాను సాధించాడు. 12 ఏళ్లపాటు తన మాతృదేశంలో లెక్కలూ, భౌతికశాస్త్రాలను బోధించి అమెరికాకు ప్రయాణమయ్యాడు.

 

ఓ వింత బడి:

అమెరికాలో లెక్కల టీచర్ల అవసరం ఉందన్న ఆశతో ఎస్కలాంట్‌ ఆ దేశానికి చేరుకున్నాడు. అందుకు అవసరం అయ్యే ఇంగ్లిషు మీద పట్టు సాధించిన లాస్‌ ఏంజెల్స్‌లోని ఒక బడిలో ఉద్యోగానికి కుదురుకున్నాడు. ఆ బడి పేరు ‘గార్‌ఫీల్డ్‌ హైస్కూల్‌’. ఎస్కలాంట్ అక్కడ ఉద్యోగంలో చేరేనాటికి ఆ బడిలో పరిస్థితులు ఆధ్వాన్నంగా ఉన్నాయి. అక్కడి విద్యార్థులు మంచి మార్కులు సాధించడం లేదన్న కారణంగా బడి గుర్తింపుని సైతం రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

 

దేశంలోనే నెం.1

గార్‌ఫీల్డ్‌ హైస్కూలులో ప్రవేశించిన ఎస్కలాంట్‌ అక్కడి విద్యార్థులలో లెక్కల పట్ల తపనను రగిల్చాడు. లెక్కలు నేర్చుకుంటే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్న నమ్మకాన్ని వారిలో కలిగించాడు. లెక్కల్లోనే అత్యంత క్లిష్టంగా భావించే ‘కేల్క్యులస్’లో వారికి తర్ఫీదుని ఇవ్వడం మొదలుపెట్టాడు. విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయుడు కూడా కష్టపడితేనే తగిన ఫలితాలు వస్తాయన్నది ఎస్కలాంట్‌ నమ్మకం. అందుకే బడిలో అందరికంటే ముందుగా వచ్చి, అందరికంటే ఆలస్యంగా ఇంటికి చేరేవాడు. ఎలా చెబితే విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమవుతాయో, ఎస్కలాంట్‌ దానికి అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించుకునేవారు. ఎస్కలాంట్‌ పనితీరు చూసిన అసూయ చెందిన బడి అధికారులు, ఆయనను ఎలాగైనా తరిమికొట్టాలని శతధా ప్రయత్నించేవారు.

 

అండగా నిలిచిన ప్రిన్స్‌పల్‌:

అదే సమయంలో ‘హెన్రీ గ్రాడిలస్‌’ అనే ప్రిన్స్‌పల్‌ ఆ బడిలోకి అడుగుపెట్టారు. ఆయన ఎస్కలాంట్ పనితీరుని అర్థం చేసుకోవడంతో ఇక లెక్కల పాఠాలకు తిరుగులేకుండా పోయింది. 1988లో ఆయన విద్యార్థులలో ఏకంగా 18 మంది జాతీయ స్థాయి లెక్కల పరీక్షలలో ఉత్తీర్ణులు కావడంతో, ఎస్కలాంట్‌ పేరు మారుమోగిపోయింది. ఈ విషయం మీద అనుమానం కలిగిన అధికారులు ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్ష పెట్టినా అదే ఫలితం వచ్చింది. పైపెచ్చు, మరుసటి ఏడాది 30 మంది ఎస్కలాంట్‌ శిష్యులు అదే పరీక్షలో ఉత్తీర్ణులు కావడంతో ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు.

 

ఇంతింతై:

ఏటికేడు ఎస్కలాంట్‌ బోధనలో రాటుదేలిన శిష్యులు దేశంలో సంచలనం సృష్టించడం మొదలుపెట్టారు. కేవలం గణిత పరీక్షలలో నెగ్గడమే కాదు, పేరు పొందిన విశ్వవిద్యాలయాల్లో చోటునీ సంపాదించుకునేవారు. 1988లో ఆ దేశ అధ్యక్షుడి చేతుల మీదుగా ఎస్కలాంట్‌కు Presidential Medal for Excellence అందింది. అదే సంవత్సరం ఎస్కలాంట్ జీవితం ఆధారంగా ‘జే మాథ్యూస్‌’ అనే రచయిత Escalante: The Best Teacher in America అనే పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం ఆధారంగా Stand and Deliver అనే చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది.

 

ఇదీ విజయరహస్యం!

ఎస్కలాంట్‌ విజయరహస్యాల గురించి ఎన్నో వ్యాసాలు వెలువడ్డాయి. ఆయన పాఠాలను వినేందుకు రొనాల్డ్‌ రీగన్‌, అర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్ వంటి ప్రముఖులెందరో ఎస్కలాంట్ తరగతులలో కూర్చున్నారు. ఒకప్పుడు లెక్కలంటే భయపడి వాటికి దూరంగా ఉన్న పెద్దవారు సైతం ఆయన దగ్గర లెక్కలు నేర్చుకునేందుకు తిరిగివచ్చేవారు. కారణం! ఎస్కలాంట్ ఏదో తనకు వచ్చిన నాలుగు ముక్కలను చెప్పేస్తే బాధ్యత తీరిపోతుందని అనుకోలేదు. తను చెప్పిన విషయం విద్యార్థి మనసులో నాటుకోవాలనీ, అతనికి భవిష్యత్తులో ఉపయోగపడాలనీ కోరుకునేవాడు. అందుకోసం జోక్స్ వేస్తూ, నిజజీవితంలోని ఉదాహరణలు చూపిస్తూ, ఉత్తేజకరమైన సూక్తులను పేర్కొంటూ... విద్యార్థులకు ఎలాగైనా తను చెప్పే పాఠం అర్థం కావడమే పరమావధిగా బోధించేవాడు. అందుకే ఆరు సంవత్సరాల క్రితం ఎస్కలాంట్‌ క్యాన్సర్‌ బారినపడి చనిపోయినా, ఇప్పటికీ అమెరికా అతణ్ని మర్చిపోలేకపోతోంది. ఇలాంటి లెక్కల టీచర్ అందరికీ ఉంటే ఎంత బాగుండునో కదా!

 

- నిర్జర.