పిండివంటల్ని బెల్లంతోనే ఎందుకు చేస్తాం!

 

పండుగ వస్తోందంటే చాలు... మనకి పూజలు, పిండివంటలే గుర్తుకువస్తాయి. పూజల సంగతి పక్కనపెడితే, పిండివంటల వెనకాల కూడా బోలెడు ఆరోగ్య రహస్యాలు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలా ఉగాది పచ్చడిలో భాగంగా మనం పుచ్చుకునే బెల్లం గురించి కొన్ని విశేషాలు ఇవిగో....

 

జీర్ణశక్తికి - బెల్లపు రుచికి, క్షారగుణానికీ జీర్ణరసాలు ఎక్కువగా ఊరతాయి. వీటి వల్ల అంతకుముందు తీసుకున్న ఆహారం కూడా సులభంగా జీర్ణమైపోతుంది. అందుకనే భుక్తాయాసంగా ఉన్నప్పుడు ఒక పలుకు బెల్లం తినమని చెబుతూ ఉంటారు పెద్దలు.

 

కావల్సినన్ని ఖనిజాలు - చెరుకుగడలోని పోషపపదార్థాలన్నీ కూడా పంచదారలోకి వచ్చేసరికి మాయమైపోతాయి. పంచదార తెల్లగా, శుభ్రంగా కనిపించడం కోసం దానిలో ఉపయోగపడే పదార్థాలన్నింటిని తొలగించి పారేస్తారు. కానీ బెల్లంలో మాత్రం అలా కాదు. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు బెల్లంలో సమృద్ధిగా కనిపిస్తాయి. 

 

రక్తహీనత బలాదూర్‌- బెల్లంలో ఉండే ఐరన్‌ వల్ల రక్తహీనత సమస్య దూరమైపోతుంది. అందుకనే గర్భిణీ స్త్రీలనీ, బాలింతలనీ బెల్లం తినమని చెబుతుంటారు. 50 గ్రాముల బెల్లం తిన్నా కూడా మనకు రోజువారీ అవసరమయ్యే ఇనుములో చాలావంతు శరీరానికి అందుతుంది.

 

కాలేయం శుద్ధి - మన శరీరంలో పేరుకున్న కల్మషాలన్నింటినీ బెల్లం బయటకు పంపేస్తుందట. కాలేయం వంటి అవయవాన్ని కూడా శుద్ధి చేసే ప్రభావం బెల్లానికి ఉందని చెబుతారు. కాలేయం శుభ్రంగా ఉంటే శరీరానికి వచ్చే సగం సమస్యలు తీరిపోయినట్లే!

 

రుతుసమస్యలు - మహిళల రుతుసమస్యల గురించి ఎంత చెప్పుకున్నా వేదన తీరదు. ముఖ్యంగా రుతుక్రమం సమయంలో నిస్సత్తువగా ఉండటం, కండరాలు లాగడం వంటి సమస్యలు ఏర్పడతాయి. బెల్లం తినడం వల్ల నిస్సత్తువ ఎలాగూ తగ్గుతుంది. ఇక బెల్లంతో శరీరంలో ఎండోమార్ఫిన్స్‌ అనే హార్మోన్లు ఉత్తేజితం అవుతాయట. వీటివల్ల మనసు కూడా ఉత్సాహంగా ఉంటుందంటున్నారు.

 

ఒంటికి చల్లదనం - బెల్లపు నీరు వల్ల ఒంట్లోని ఉష్ణోగ్రతలు అదుపు తప్పకుండా ఉంటాయట. వేసవిలో బెల్లంతో చేసిన పానకంతో కడుపు చల్లగా ఉంటుంది. అందుకనే కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకించి బెల్లపు షర్‌బత్‌ చేసుకుని తాగుతారు. మనకా అవసరం లేకుండా శ్రీరామనవమి సందర్భంగా కావల్సినంత బెల్లపు పానకం వాడవాడలా దొరుకుతుంది.

 

కావల్సినంత శక్తి - పంచదార ఒక కృత్రిమ పదార్థం. దాని వల్ల పంచదారలోని చక్కెరలు ఒక్కసారిగా రక్తంలోకి కలిసిపోయి షుగర్‌ స్థాయి ఆసాంతం పెరిగిపోతుంది. కానీ బెల్లం అలా కాదు. అందులోని చక్కెరలు నిదానంగా రక్తంలోకి కలుస్తూ కావల్సినంత శక్తిని అందిస్తాయి. దాని వల్ల ఒంటికి నిరంతరం శక్తి లభిస్తూ ఉంటుంది.

 

కీళ్లసమస్యలకి ఉపశమనం - కీళ్లనొప్పులు, బెణుకులు, వాపులని నివారించడంలో బెల్లం గొప్ప పాత్ర పోషిస్తుంది. నాలుగు నుంచి ఆరువారాలపాటు రోజు కాస్త బెల్లాన్ని పాలల్లో కలిపి తీసుకుంటే కీళ్లనొప్పులకి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతారు.

 

ఇప్పుడంటే ఇంట్లోకి రకరకాల తినుబండారాలు బయటనుంచే తెచ్చకొంటున్నాము. కానీ ఒకప్పుడు నువ్వులు, బెల్లంతో చేసిన పాకమే ఇంటింటా కనిపించేది. పిల్లలకి ఇలాంటి నువ్వుల ఉండని పెట్టడం వల్ల... వారికి తగినంత శక్తి ఎలాగూ లభిస్తుంది. దాంతోపాటుగా చిన్నతనంలో వారిని వేధించే శ్వాసకోశ వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుందట!!!

 

చెప్పుకొంటూ పోతే బెల్లం వల్ల చేకూరే ప్రయోజనాల చిట్టా చేంతాడంత తేలుతుంది. అవన్నీ గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి... పంచదారతో పోలిస్తే బెల్లం ఆరోగ్యకరం అన్న విషయం గుర్తెరిగితే చాలు.

 

- నిర్జర.