టీపీసీసీ అధ్యక్ష పదవి రేసులో జగ్గారెడ్డి!!

 

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి మార్పు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా పేర్కొన్నారు. హైద్రాబాద్ లోని గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏఐసీసీ నిర్ణయం తీసుకునే వరకూ ఆ పదవిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశాన్ని ప్రస్తావించారు. క్రమశిక్షణను ఎవరూ ఉల్లంఘించినా చర్చలు తప్పవని హెచ్చరించారు. గెలిచిన తర్వాత ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని, ఏదైనా చెప్పాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెప్పాలని, పార్టీ నుండి వెళ్లిపోతే పదవులకు రాజీనామా చేయాలని సూచించారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే కొనసాగాలని కోరారు.

మరోవైపు.. తెలంగాణ పీసీసీ చీఫ్ కావాలని తాను కూడా కోరుకుంటున్నానని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇప్పటికిప్పుడు మార్చాల్సిన అవసరం లేదని అంటూనే.. తాను పీసీసీ పదవిని కోరుకుంటున్న విషయాన్ని తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియాకు తెలిపినట్లు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎలా తీసుకురావాలన్న దానిపై తన దగ్గర ఓ మెడిసిన్ ఉందని వ్యాఖ్యానించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.