హరీష్‌రావుపై జగ్గారెడ్డి ఫైర్!!

 

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై మరోసారి విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం వేళ ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ప్రాజెక్టులు రాలేదన్న హరీష్ రావు వ్యాఖ్యలను జగ్గారెడ్డి తప్పుబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదన్న బాధతోనే ఆయన ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మెప్పు కోసమే కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

ప్రాజెక్టులు ఎవరు కట్టించినా సమర్థించాల్సిందే అన్నారు జగ్గారెడ్డి. కేసీఆర్‌ని కూడా అదే విధంగా సమర్దించామని చెప్పారు. కానీ హరీష్ రావు కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. 50 ఏళ్లలో కాంగ్రెస్‌ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని హరీష్‌ రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రాజెక్టులు కట్టిందో హరీష్ రావుకు తెలియకుంటే తన మామ కెసిఆర్ ను అడిగి తెలుసుకోమన్నారు. కల్వకుర్తి, నెట్టంపాడు, ఎల్లంపల్లి, జూరాల, దేవాదుల ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్సే అని చెప్పారు. హరీష్ రావు నీళ్లు తాగిన సింగూరు, మంజీరా ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు నీళ్లు తాగే హరీష్‌రావు పెరిగాడని మండిపడ్డారు జగ్గారెడ్డి.