బీజేపీకి జగన్ ఎర!

 

 

 

తనమీద వున్న అవినీతి కేసులన్నీ తొలగిపోవాలి. కుదిరితే పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కుదరకపోతే చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రైపోవాలి.. ఇది జగన్ ముందు కనిపిస్తున్న లక్ష్యాలు. ఈ లక్ష్యాలు సాధించే క్రమంలో తనకు అడ్డు వచ్చిన ప్రతిదాన్నీ తొలగించుకుని వెళ్ళిపోవడమే జగన్ అనుసరిస్తున్న విధానం. సామ, దాన, భేద, దండోపాయాలను సమయానుకూలంగా ప్రయోగించడంలో సిద్ధహస్తుడైన జగన్ ఇప్పుడు తన రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం మీద దాన, భేదోపాయాలను ప్రయోగించాడు.

 

 

సమైక్యాంధ్ర నినాదాన్ని ఢిల్లీలో వినిపిస్తానంటూ హస్తినకు వెళ్ళిన జగన్ అక్కడ పలు పార్టీల పెద్దలను కలిశాడు. మీడియా ముందు ఒక విధానాన్ని, ఆంతరంగిక సమావేశాల్లో మరో విధానాన్ని ప్రకటించి తన రాజకీయ చతురతను చాటుకున్నాడు. ఈమధ్యకాలంలో భారతీయ జనతాపార్టీ తన విభజన విధానంలో మార్పులు చేసుకుంటోంది. అడ్డగోలు విభజనను వ్యతిరేకిస్తోంది. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీకి చేరువ  అవుతోంది. రాష్ట్రంలో బీజేపీ నాయకులు తెలుగుదేశం పొత్తు విషయంలో మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నప్పటికీ కేంద్ర నాయకత్వం మాత్రం తెలుగుదేశంతో దోస్తీకి సిద్ధమైపోయింది. అదే ఖాయమైతే, రాష్ట్ర అడ్డగోలు విభజనకు అడ్డు పడుతుంది. అంతేకాదు జగన్ కంటున్న కలలన్నీ కల్లలైపోతాయి. ఈ ప్రమాదాన్ని ఊహించిన జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు తన దగ్గరున్న దాన, భేదోపాయాలను బయటకు తీశాడు.




బీజేపీ నేతలతో ఆంతరంగికంగా జరిగిన సమావేశంలో రాబోయే ఎన్నికలలో బీజేపీతో పొత్తుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తన పార్టీతో పొత్తు పెట్టుకుంటే తన సంపూర్ణ మద్దతు బీజేపీకి ఇస్తానని దానోపాయాన్ని, అలాగే బీజేపీని తెలుగుదేశం పార్టీకి దూరం చేయడానికి భేదోపాయాన్ని ప్రదర్శించాడని తెలుస్తోంది. అయితే జగన్ పెట్టిన ప్రపోజల్‌ విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం పెద్దగా స్పందించలేదని, చూద్దాం.. చేద్దాం అన్నట్టుగా పొడిపొడిగా స్పందించి పంపించేసిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ ఎన్ని ఉపాయాలు ప్రదర్శించినా భవిష్యత్తులో ఆయనను చుట్టుముట్టబోయే అపాయాలు ఆగుతాయా?