జగన్ పాదయాత్రను పూర్తిచేస్తారా..? మధ్యలో ఆపేస్తారా..?

ఆరునూరైనా 2019లో అధికారాన్ని అందుకోవాలి.. ఇప్పటికే వీధి పోరాటాలు, రోడ్ల మీద బైఠాయింపులు అన్నీ అయిపోయాయి. ప్రజలు తన గురించే మాట్లాడుకోవాలి.. తన పేరు జనం నోట్లో నానాలంటే ఏం చేయాలి. వీటన్నింటికి సమాధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత ఎంచుకున్న మార్గం పాదయాత్ర. సీఎం అవ్వడమే లక్ష్యంగా.. రాష్ట్రం మొత్తం చుట్టివచ్చేలా సుమారు ఆరు నెలల పాటు మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయాలని జగన్ నిర్ణయించారు. ఆయన నిర్ణయం వెనుక బలమైన కారణాలున్నాయి. రాష్ట్ర చరిత్రలో పాదయాత్రలకు ప్రత్యేక స్థానం ఉంది. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాగించిన "ప్రజా ప్రస్థానం" పాదయాత్రతో ప్రజల మన్ననలు పొంది సీఎం అయ్యారు. ఆ తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన వయసును సైతం లెక్క చేయకుండా రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ఆయనా సీఎం అయ్యారు.

 

ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అయి తాను కూడా ముఖ్యమంత్రిని కావాలని భావించారు జగన్. దీనిలో భాగంగా ఈ నెల 6న ఇడుపులపాయ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అయితే ఆయన ఆరు నెలల కాలంలో అన్ని అవాంతరాలను దాటుకొని.. అనుకొన్న లక్ష్యాన్ని అందుకోగలరా అన్న సందేహన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.. అందుకు కారణాలు లేకపోలేదు.. యాత్ర ప్రారంభించి నేటికి తొమ్మిదో రోజు.. ఇవాళ్టీకి ఆయన 100 కిలోమీటర్ల మైలు రాయిను అందుకున్నారు. ఇంత నత్తనడకన ఆయన పాదయాత్ర సాగుతోంది.. తొలుత యాత్రను చాలా తేలిగ్గా తీసుకున్నారట జగన్ .. అయితే రంగంలోకి దిగితే కానీ మ్యాటర్ అర్థం కాలేదు..

 

జీవితంలో ఎప్పుడు ఈ స్థాయిలో శారీరకంగా కష్టపడకపోవడంతో త్వరగా అలసిపోతున్నారు.. మొదటి రోజే నడుం పట్టేయడం.. రెండో రోజు నుంచి ఇన్‌ఫెక్షన్‌లు రావడంతో జగన్‌కు ఇబ్బందులు మొదలయ్యాయట. దీనికి తోడు యాత్ర నిర్వహిస్తోన్న విధానం.. దానికి ప్రజల నుంచి వస్తోన్న స్పందన పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా సొంత జిల్లాలోనే ఇలా జరగడం వారిలో సందేహాలను రేకేత్తిస్తోంది. మొదటిరోజు లక్షమంది జనం వస్తారని అంచనా వేయగా.. గట్టిగా 20వేల మందికి మించి రాలేదట. ఆ రోజును పక్కనబెట్టినా ఆ తర్వాతి రోజుల్లో కూడా ప్రజల నుంచి ఆశించిన స్పందన లభించడం లేదు.

 

మరోవైపు రోజుకు 15 కిలోమీటర్లు నడిస్తేనే.. ఆరు నెలల కాలంలో మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేయగలుగుతారు కానీ.. ఆయన 10 కిలోమీటర్లకు మించి నడవలేకపోతున్నారు. ఇలా నడిస్తే మొత్తం లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ఎంత లేదన్నా 300 రోజులు కావాలి.. మధ్యలో అనారోగ్య సమస్యలు, వాతావరణం దానికి తోడు కోర్టు వాయిదాలు ఇలా పోతే దాదాపు సంవత్సరానికి పైగానే యాత్రకు సమయం పడుతుంది. వచ్చే ఏడాది చివర్లో ముందుస్తు ఎన్నికలు వస్తాయని భావిస్తున్న సమయంలో జగన్ యాత్రలు చేసుకుంటూ వెళితే పార్టీ బలపడటం సంగతి పక్కనబెడితే బలహీనపడే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పాదయాత్ర దూరాన్ని కుదించడమో లేదా మధ్యలో ఆపివేయక తప్పకపోవచ్చని వారు అంటున్నారు. మరి జగన్ వెనుకడుగు వేస్తాడా లేక ఎన్ని సమస్యలు ఎదురైనా మడమతిప్పక ముందుకే వెళ్తాడా అన్నది కాలమే నిర్ణయించాలి.