ఓదార్చింది చాల్లేవయ్యా మగడా!

 

 

 

జగన్ మరోసారి ఓదార్పు యాత్ర మొదలెట్టాడు. వైఎస్సార్ చనిపోయి నాలుగేళ్ళు దాటిపోయింది. ఆయన చనిపోయిన బాధ తట్టుకోలేక నిజంగా గుండె ఆగి చనిపోయిన వాళ్ళు ఎంతమంది వున్నారోగానీ, జగన్ ఎంత ఓదార్చినా వాళ్ళ సంఖ్య మాత్రం తరగడం లేదు. ఒకవేళ నిజంగా వైఎస్ మరణం వల్ల బాధతో గుండె ఆగి చనిపోయినవాళ్ళ కుటుంబాలు ఈ నాలుగేళ్ళుగా జగన్ వస్తాడు.. మమ్మల్ని ఓదారుస్తాడని ఎదురుచూస్తూ వుంటాయా? సరే ఇదెలా వున్నా, జగన్ చేస్తున్న ఓదార్పు యాత్రల విషయంలో ఓదార్చింది చాల్లేవయ్యా మగడా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

ఈ గుసగుసలు వినిపిస్తోంది ఎవరో బయటి వాళ్ళు కాదు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే ఇలా గుసగుసలాడుకుంటున్నారు. నాలుగేళ్ళ నుంచి  జగన్ పాడుతున్న ఓదార్పు పాట విని వాళ్ళకి బోర్ కొట్టేసింది. ఉద్యమాలు చేయడానికి, జనాల్లోకి వెళ్ళడానికి బోలెడన్ని సమస్యలు, ఇష్యూలు వుండగా జగన్ ఈ ‘ఓదార్పు’నే పట్టుకుని వేలాడుతూ వుండటం చూసి నాయకులు, కార్యకర్తలు చిరాకు పడుతున్నారు. జగన్ ఇలా వ్యవహరిస్తూ వుండటం వల్ల పార్టీ నష్టపోతోందని బాధపడుతున్నారు. ఇలా బాధపడుతున్నవాళ్ళని ఓదార్చేవాళ్ళే లేకపోవడం బాధాకరం. బయట అందర్నీ ఓదార్చే జగన్ కూడా వాళ్ళని ఓదార్చడం లేదు.



కొంతమంది నాయకులు ఇక ఓదార్పు యాత్రని ఆపేద్దాం బాబూ అని జగన్‌కి చెబితే జగన్ వాళ్ళని పిచ్చోళ్ళని చూసినట్టు చూశాడని తెలిసింది. ఓదార్పు యాత్ర  ద్వారా తనకు ప్రజల్లో ఫాలోయింగ్ పెరిగిపోతోందని, ఇకముందు ఇలాంటి పనికిరాని సలహాలు ఇవ్వద్దని సదరు నాయకులను జగన్ హెచ్చరించాడని తెలిసింది. ఈ విషయంలో ఇంకోసారి నోరెత్తితే పార్టీలోంచి బయటకి పంపిచేస్తాడన్న భయంతో అందరూ కిక్కురుమనకుండా ఉన్నారు. ఎలాగూ జగన్ తన విధానం మార్చుకోడు. రాబోయే ఎన్నికలలో ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో వైఎస్సార్సీపీ చిత్తుగా ఓడిపోతుంది. అప్పుడు వైఎస్సార్సీపీ నాయకులందరూ కలసి జగన్‌ని ఓదార్చాల్సి వస్తుంది.