జగన్ మదర్ సెంటిమెంట్!

 

 Jagan Mother Sentiment, sonia gandhi, Samaikya Sankharavam, trs, telangana state, ysrcongress, ys vijayamma

 

 

వైకాపా నాయకులు జగన్మోహనరెడ్డి ఏ దుర్ముహూర్తంలో సమైక్య శంఖారావ సభ ఏర్పాటు చేశాడోగానీ, వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా అన్ని పార్టీల వారి చేతా తిట్లు తింటున్నాడు. ఇటు సమైక్యవాదులు, అటు విభజనవాదులు, అటు కాంగ్రెస్ పార్టీ, అటు తెలుగుదేశం పార్టీ.. మధ్యలో టీఆర్ఎస్. అన్ని వైపుల నుంచీ జగన్ నిర్వహించిన సభ మీద, జగన్ మాట్లాడిన తీరు మీద విమర్శనాస్త్రాలు దూసుకొస్తున్నాయి.

 

జగన్‌తో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్న కాంగ్రెస్,  టీఆర్‌ఎస్ పార్టీలు కూడా అందరూ జగన్ని తిడుతున్నారు.. మనం కూడా తిట్టకపోతే బాగోదన్నట్టుగా వాళ్ళు కూడా ప్రెస్‌మీట్లు పెట్టి జగన్‌ని తిట్టిపోశారు. సరే బయటి పార్టీల వాళ్ళు తిట్టారంటే సర్దిచెప్పుకోవచ్చు. వైకాపా శ్రేణులు కూడా సభలో జగన్ మాట్లాడిన తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో బాహాటంగా బయటపడలేక లోపల లోపలే కుమిలిపోతున్నారు. జగన్ ఎవరు మంచి చెప్పినా వినడు.. ఒకవేళ సాహసించి మంచి చెపితే ఆ చెప్పినవాళ్ళనే తరిమేస్తాడన్న వాస్తవం పార్టీలో ఎవరూ నోరెత్తకుండా చేస్తోంది.



శంఖారావ సభలో మిగతా విషయాల సంగతి అలా వుంచితే, జగన్ సోనియాగాంధీని ‘అమ్మా’ అంటూ పిలిచిన తీరు మీద సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. సోనియా మీద విమర్శలు చేయదలుచుకున్నప్పుడు ఘాటుగా చేయాలే తప్ప, ‘అమ్మా’ అని ప్రేమగా, అభిమానంగా పిలిచి విమర్శలు చేయడమేంటని అంటున్నారు. జగన్ నోటి వెంట వచ్చిన ‘అమ్మా’ అనే పిలుపులో వినిపించిన మాధుర్యం, కారుణ్యం, సెంటిమెంట్ తమకు చెవుల్లో సీసం పోసిన అనుభూతిని కలిగించిందంటున్నారు.



శంఖారావ సభలో సోనియాని విమర్శిస్తూ జగన్ మాట్లాడిన తీరు తల్లిమీద అలిగిన కొడుకు మాట్లాడుతున్నట్టే ఉంది తప్ప, కడుపు మండుతున్న తెలుగు ప్రజల తరఫున మాట్లాడుతున్నట్టు లేదని అంటున్నారు. ప్రసంగాలు చేయడంలో జగన్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు.