జగన్ కాంగ్రెస్ పార్టీకి కూడా హస్తం ఇవ్వబోతున్నారా?

 

కాంగ్రెస్-వైకాపాల మధ్య కుదిరిన రహస్య ఒప్పందం వల్లనే జగన్మోహన్ రెడ్డి బెయిలుపై బయటకి వచ్చి సమైక్యరాగం ఆలపిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆరోపణ. జగన్ కోసం కాంగ్రెస్ అధిష్టానం తమ రాజకీయ జీవితాన్ని, చివరికి పార్టీని కూడా పణంగా పెట్టిందని స్వయంగా కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్-వైకాపాల మధ్య ఉన్న రహస్య అనుబంధం గురించి ప్రత్యక పరిశోధన మరవసరం లేదు.

 

కానీ జగన్మోహన్ రెడ్డి గత నాలుగు రోజుల్లో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీని పొగుడుతూ మాట్లాడటం చూస్తే ఇప్పుడు అతను కాంగ్రెస్ పార్టీకి కూడా హస్తం ఇవ్వబోతున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

 

మొన్న జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఒక వ్యక్తి వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడటం అంటే అతను సమర్ధుడనే కదా లెక్క? మోడీ తన పార్టీని సెక్యులర్ పార్టీగా మలచగలిగితే, భవిష్యత్తులో బీజేపీకి అనేక పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది,” అని అన్నారు. అంటే వైకాపా బీజేపీతో జతకట్టే అవకాశాలున్నాయని స్పష్టం చేస్తున్నారు.

 

అయితే కాంగ్రెస్ అధిష్టానంతో ఒప్పందం కుదుర్చుకొని ఇప్పుడు అతను బీజేపీకి అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నట్లు? ఆయన జైలు నుండి విడుదలయిన రోజునే సీనియర్ కాంగ్రెస్ నేత పీసీ చాకో “వ్యక్తులు జైలులో ఉన్నపటికీ, బయట ఉన్నపటికీ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఈయవలసి ఉంటుందని” అని స్పష్టంగా చెప్పారు. మరటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నట్లు? పది చార్జ్ షీట్లు వెనకేసుకొన్నఆయన, తనను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కావాలనుకొంటే అప్పుడు మళ్ళీ జైల్లోకి పంపగలదని గ్రహించకనే ఈవిధంగా మాట్లాడుతున్నారా? అని ఆలోచిస్తే కాదనే చెప్పవచ్చును.

 

కాంగ్రెస్-వైకాపాల మధ్య అనైతిక బంధం, జగన్ బెయిలు కోసం సీబీఐని ఏవిధంగా నిర్వీర్యం చేసిన సంగతినీ తెదేపాతో సహా అన్ని ప్రతిపక్షాలు కోడై కూస్తుంటే, దానిని స్వయంగా అధికార కాంగ్రెస్ నేతలే రూడీ చేస్తుంటే, వీటి నుండి బయట పడేందుకే నరేంద్ర మోడీని పొగుడుతూ, బీజేపీతో పొత్తుల గురించి మాట్లాడుతూ ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

 

“ఆయన సోనియాను విమర్శించిన మరు క్షణమే ఆయన బెయిలు రద్ధవుతుందని” తెదేపా చేసిన ఆరోపణలు తప్పని ఋజువు చేసేందుకే ఆయన ఇప్పుడు సోనియా గాంధీని కూడా విమర్శించడం మొదలు పెట్టారు. అయితే బహుశః ఇది కూడా ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను మభ్యపెట్టేందుకేనని చెప్పవచ్చును.

 

అయితే ఈవిధంగా వ్యవరించడం వలన మరో ప్రయోజనం కూడా ఉంది. ఒకవేళ రానున్నఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచలేక పోయినట్లయితే అప్పుడు ఇదే ప్రాతిపదికన బీజేపీతో పొత్తులు సాగించడానికి మార్గం సుగమం అవుతుంది. ఈసారి ఎలాగైనా కేంద్రంలో అధికారం దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ, వైకాపా కోరుండి మద్దతిస్తామని ముందుకు వస్తుంటే ఎందుకు కాదంటుంది? అందువల్ల రానున్న ఎన్నికలలో ఎవరు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచగలిగితే వారికే వైకాపా మద్దతు ప్రకటించడం ఖాయం.