కోటి సంతకాలు జగన్ను జైలు నుంచి బయటపడేయగలవా?

Publish Date:Jan 3, 2013

 

తెలంగాణాలో జోరుగా సాగుతున్న తన పాదయాత్రని షర్మిల అకస్మాత్తుగా ముగించేయడంతో, గత కొన్ని రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకరకమయిన స్తబ్దత నెలకొంది. ఆ స్తబ్దతని, నిశబ్దాన్ని చెందిచడానికేనన్నట్లు మొదలుపెట్టిన కోటి సంతకాల సేకరణ జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని బయటకి తీసుకురాలేదని తెలిసినా కూడా కొనసాగించక తప్పని పరిస్థితి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది. కోటి సంతకాలతో ఒక ముద్దాయిని జైలు నుండి విముక్తం చేయగలిగేమాటయితే, ఈ పాటికి మనదేశంలో జైళ్లలో ఉన్న బడానేతలందరూ ఎప్పుడో బయటపడేవారు. ఆ సంగతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలియక కాదు. గానీ, పార్టీలో ఏదో ఒక కార్యక్రమం జరగకపోయినట్లయితే, అది పార్టీ కార్యకర్తల మనోబలాన్ని దెబ్బతీసి చివరికి పార్టీ ఉనికికే ప్రమాదంగా మారవచ్చును. అందుకే కోటి సంతకాల కార్యక్రమం మొదలయింది. షర్మిల పాదయాత్ర జరుగుతున్నంత కాలం కూడా చురుకుగా ఉన్న ఆ పార్టీనేతలు, కార్యకర్తలు ప్రస్తుతం చేసేదేమిలేక కోటి సంతకాల సేకరణలో పాల్గొంటూ, పార్టీ త్వరలో సరయిన రాజకీయ కార్యక్రమం ఏదయినా నిర్వహిస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు.

 

అయితే, ప్రస్తుతం నాయకత్వ సమస్యతో ఇబ్బందిపడుతున్న ఆ పార్టీలో చొరవ తీసుకొని పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఒకవేళ ఎవరయినా చొరవతీసుకొని ముందుకువచ్చి నిలబడి కార్యక్రమాలు మొదలుపెడితే, పార్టీలో ఎవరి నుండి ఏవిమర్శలు ఎదుర్కోవలసి వస్తుందనో భయంతో నేతలందరూ పత్రికా స్టేట్మెంట్ లకే పరిమితమవుతున్నారు. తద్వారా, రాష్ట్రంలో పార్టీలో కార్యకర్తల సందడి, పార్టీ ఉనికి కూడా తగ్గినట్లు కనిపిస్తోంది.

 

ఈ నిశబ్దాన్ని చేదించేందుకు పార్టీ గౌరవాధ్యాక్షురాలు వై.యస్. విజయమ్మే మళ్ళీ చొరవక తీసుకోక తప్పట్లేదు. ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన తెరాస నేత మహిపాల్ రెడ్డి పార్టీలో జేరెందుకు సముఖత చూపించడంతో, ఆ సందర్భాన్ని ఉపయోగించుకొంటూ మెదక్ జిల్లాలో ఒక భారీ బహిరంగసభను విజయమ్మ ఆద్వర్యంలోనిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనపై తన అభిప్రాయం స్పష్టంగా తెలియజేయని కారణంతో, తెలంగాణా వాదులు ఆ పార్టీపై ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తుతున్న ఈ తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ మొట్టమొదటి సభకి చాలా ప్రాదాన్యం ఉందని చెప్పవచ్చును. ఈ సభ విజయవంతం కావడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమని చెప్పవచ్చును. అదే సమయంలో, తెలంగాణావాదులు కూడా తమనిరసనలు తెలియజేయడానికి కూడా ఇదే సభను వాడుకొనే అవకాశం ఉండటంవల్ల ఇది కీలకమయిన సభగానే భావించవచ్చును.

 

ఈ సభలోనే విజయమ్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇకముందు ఎవరు నడిపించబోతున్నారో కూడా ప్రకటించే అవకాశం ఉంది. గనుక ఈ సభకు మరింత ప్రాదాన్యత ఉంటుంది.

 

ఏదేమయినా, సారధిలేకుండా నడుస్తున్న రధం వంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య తీరేవరకు అన్నిపార్టీలకు చులకనగానే కనిపిస్తుంది.