విశాఖ టూ విజయవాడ..కోడి కత్తి కేసు

 

విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి జరిగిన కేసు విజయవాడ కోర్టుకు చేరింది. జగన్‌పై దాడి కేసు విచారణను ఎన్‌ఐఏకు అప్పగించడంతో కేసు రికార్డులను ఎన్‌ఐఏ కోర్టుకు అప్పగించాలని అధికారులు కోరారు. దీంతో 107 రోజుల పాటు విశాఖలో జరిగిన విచారణ ఇకపై విజయవాడలో కొనసాగుతుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావును అడవివరం జైలు నుంచి ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి దాటిన తర్వాత ఒక సుమో వాహనంలో విశాఖ నుంచి విజయవాడకు తరలించారు. నిందితుడిని ఇవాళ 3వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చనున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసును ఎన్ఐఏ చేపట్టడంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర పరిధిలోని కేసులో ఎన్ఐఏ జోక్యం చేసుకోవడం ఏంటని నిలదీస్తుంది. దీనిపై హైకోర్టు వేకేషన్ బెంచ్2ను ఆశ్రయించాలని టీడీపీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. హైకోర్టుకు జనవరి 21 వరకూ సెలవుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వెకేషన్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేసే అవకాశముందని భావిస్తున్నారు.