బెయిల్ ఇస్తే నిజం చెప్తా.. జగన్‌పై దాడి చేసిన నిందితుడు

 

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై, ఆయ‌న‌ వీరాభిమాని క‌త్తితో దాడి చేసిన ఘ‌ట‌న ఏపీలో సంచ‌లనాన్ని రేకెత్తించిన విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వహారం ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. వివాదాస్ప‌దంగా మారి అధికార తెలుగుదేశం పార్టీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ మ‌ధ్య మాట‌ల యుద్దానికి దారి తీసింది. ఈ అంశంపై అధికార పార్టీ, ప్ర‌తిప‌క్ష నేత‌లు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. జ‌గ‌న్‌ను క‌త్తితో పొడిచిన అభిమానే తాను పొడిచాన‌ని చెప్ప‌గా.. ప్ర‌భుత్వ వైఫ‌ల్యం కార‌ణంగానే ఈ దాడి జ‌రిగింద‌ని వైసీపీ అర్ధం ప‌ర్ధం లేని ఆరోప‌ణ‌లు చేశాయి.. చేస్తూనే వున్నాయి. జగన్ మాత్రం ఈ విషయం గురించి ఇంత వరకు నోరు విప్పలేదు. గాయం కారణంగా కొంత విశ్రాంతి తీసుకున్న జగన్ ఇటీవలే తన పాదమాత్ర రెండో విడతను ప్రారంభించారు.

ఇలా ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్న సమయంలో జగన్‌పై దాడి చేసిన  శ్రీనివాసరావు తల్లి ఓ సంచలనమైన వార్తను ప్రకటించారు. అదేమిటంటే.... 15 రోజుల పాటు కారాగారంలో ఉన్న శ్రీనివాస్‌ను కలవడానికి అతడి తల్లి సావిత్రమ్మ, అన్నయ్య సుబ్బరాజు, బంధువు బత్తుల రామకృష్ణ ప్రసాద్‌ గురువారం ములాఖత్‌ తీసుకున్నారు. రెండు వారాల్లో నాలుగు ములాఖత్‌లకు అవకాశం ఉన్నా...జైలులో వారు కలవడం ఇదే మొదటిసారి. ఉదయం విశాఖ కోర్టులో బెయిల్‌ వ్యవహారాలు చూసుకున్న వీరు మధ్యాహ్నం 2.30 గంటలకు జైలుకు వచ్చారు. శ్రీనివాసరావును కలసి మాట్లాడిన అనంతరం బయటకు వచ్చిన తల్లి సావిత్రమ్మ, అన్నయ్య, బంధువు మీడియాతో మాట్లాడారు. ‘బెయిల్‌ మీద నన్ను బయటకు తీసుకెళ్లండి, బయటకు వచ్చిన అనంతరం జరిగినదంతా  మీడియా ముందు వెల్లడిస్తానని’ శ్రీనివాసరావు చెప్పాడని అతని తల్లి తెలిపారు.