జగన్ పాతిక.. పవన్ ఓపిక

 

ఏపీలో అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నాయి.. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీని గద్దె దించడమే లక్ష్యంగా వైసీపీ, జనసేన మరియు బీజేపీ ఇప్పటికే ఎన్నికల ప్రణాళికలు మొదలుపెట్టాయి.. ఈ మూడు పార్టీలు ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం అంటూ టీడీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాయి.. టీడీపీ మాత్రం ఈ మూడు పార్టీలు కుమ్మక్కై కావాలనే టీడీపీ మీద విమర్శలు చేస్తున్నారంటూ ఆరోపిస్తుంది.

అయితే వచ్చే ఎన్నికల్లో మాకు అధికారం ఇస్తేనా? అంటూ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలే ఆసక్తికరంగా ఉంటున్నాయి.. చంద్రబాబు 'మళ్ళీ అధికారం ఇవ్వండి, గొప్ప రాజధాని నిర్మిస్తాం.. 25 ఎంపీ స్థానాలు గెలిపించండి, ప్రత్యేకహోదా సాధిస్తాం' అంటున్నారు.. ఇక ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ ' ఒక్కసారి అవకాశం ఇస్తే, రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తాం.. మరో పాతికేళ్ళు తామే అధికారంలో ఉండేలా పాలన అందిస్తాం' అని గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి చెప్తున్నారు.. అసలే జగన్ కి 'మాట తప్పని.. మడమ తిప్పని' నేతగా పేరుంది.. అందుకేనేమో ఆయన ఇప్పటికీ ' ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. మరో పాతికేళ్ళు మేమే అధికారంలో ఉండేలా పాలన అందిస్తాం' అనే చెప్తున్నారు.

ఇక ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చారు.. తర్వాత టీడీపీని విభేదించి, విమర్శించి.. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలిచి పాలిస్తానంటూ, ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నారు.. జగన్ 'ఒక్క అవకాశం ఇవ్వండి.. పాతికేళ్ళు అధికారంలో ఉంటాం' అంటుంటే.. పవన్ ఇంకో అడుగు ముందుకేసి ' ఒక్కసారి మాకు ఐదేళ్లు పాలించే అవకాశం ఇవ్వండి.. ఎప్పటికీ మమ్మల్నే కోరుకునే విధంగా పాలన అందిస్తాం' అని చెప్తున్నారు.. దీని బట్టి చూస్తుంటే జగన్ ఒక్కసారి అధికారంలోకి వస్తే పాతికేళ్ళు, పవన్ ఒక్కసారి అధికారంలోకి వస్తే ఓపిక ఉన్నంత కాలం పాలించేలా ఉన్నారుగా అంటూ ఛలోక్తులు వినిపిస్తున్నాయి.