అతనితో ఇతనికి పోలికా..?

 

తండ్రి, కొడుకులు ఒకే రంగంలో ఉంటే తండ్రి పనితీరును కొడుకు సమర్థతను పోల్చడం కామన్. ధీరుభాయ్ అంబానీ.. ముఖేశ్ అంబానీ, ఎన్టీఆర్.. బాలకృష్ణ, కరుణానిధి.. స్టాలిన్ ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఎన్నెన్నో. రాజకీయాల్లో జనం మధ్యలోకి వచ్చే వారిని పోలుస్తూ ప్రతి నిత్యం కథనాలు వస్తూనే ఉంటాయి. తండ్రులు వాళ్లకంటూ ఓ స్టైల్ ఏర్పరచుకున్నారు.. కానీ వారసుడిగా జనం ముందుకు వస్తే పోలిక తప్పదు. ఆంధ్రప్రేదేశ్ ప్రతిపక్షనేతగా.. వైసీపీ అధినేతగా రాజకీయాలు నడుపుతున్న జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోలుస్తున్నారు జనాలు.

 

తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం నుంచి అదిలాబాద్ వరకు.. వైఎస్‌ను పేరు పెట్టి అప్యాయంగా పిలవగల మనుషులు.. కనుసైగ చేస్తే చాలు వెనుక ముందు చూసుకోకుండా దూకగల నేతలు.. అవసరమైతే ప్రాణాలిచ్చేంత అభిమానులు.. ఇది వైఎస్‌కు గల ఛరిష్మా.. ఏం మాట్లాడితే ఏమంటాడోననే భయం.. ఎదురుచెబితే బతకనిస్తాడా అనే బెరుకు.. చివరకు ఒక్కొక్కరుగా వీడిపోతున్న అనుచరులు ఇదీ ప్రస్తుతం జగన్ వర్తమానం. ఎందుకిలా..? ఎక్కడుంది లోపం.. ఏమిటీ తేడా..? ప్రతిపక్షనేతగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో వైఎస్ శైలి భిన్నమైనది. సబ్జెక్ట్‌పైనా.. సమస్యలపైనా ఆయనకున్న అవగాహన.. వాగ్ధాటి రాజశేఖర్ రెడ్డిని అసలు సిసలు ప్రతిపక్షనేతను చేసింది. కుదిరితే వాకౌట్‌లు.. కుదరకపోతే స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం.. సమస్యలపై మాట్లాడకుండా ముఖ్యమంత్రితో పాటు అధికార సభ్యుల వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నించడం జగన్ అవగాహనా రహిత్యాన్ని తెలుపుతోంది.

 

నాయకుడు అనేవాడు టీమ్‌ని నడిపించగలగాలి.. టీమ్‌లోని మిగతా సభ్యుల మాటకు విలువనివ్వాలి.. పీసీసీ చీఫ్‌గా, ప్రతిపక్షనేతగా.. ముఖ్యమంత్రిగా వైఎస్ తన సహచరుల సూచనలను వినేవారు. తనకు పనికొస్తుందంటే దానికి అమలు చేసేవారు లేదంటే మరో ఐడియా చెప్పమనేవారు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలనే.. ముక్కుసూటితనం జగన్‌ది. ఒకరు చెప్పేది వినడం సంగతి దేవుడెరుగు.. అసలు ఎదుటివాడిని మాట్లాడనిస్తే కదా..? జగన్ చుట్టూ ఉన్నవారిలో ఇప్పుడు ఇద్దరు ముగ్గురే మిగలడానికి అసలు కారణం అదే.

 

ఆనాడు సుధీర్ఘ పాదయాత్రలో ఆయన ఏనాడూ నన్ను ముఖ్యమంత్రిని చేయండని వైఎస్ అనలేదు.. కేవలం ప్రజాసమస్యలను వినేందుకే రాజశేఖర్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారు. ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించినది మొదలు నేటి వరకు.. తమ సమస్యలు చెప్పుకుందామని వచ్చిన వారికి నన్ను సీఎంని చేయండి.. మీ సమస్యలు పరిష్కరిస్తానని చెబుతున్నారు జగన్. వైఎస్ ఒక ఎత్తు వేశారంటే ఖచ్చితంగా అది టార్గెట్ కొట్టాల్సిందే.. ఫెయిల్ అవ్వడమన్నది వైఎస్ చరిత్రలో లేదు. రాజకీయ నాయకుడు మంచి వ్యూహకర్త కావాలి.. అతను వేసే వ్యూహాలు ఎదుటివారి ఎత్తులను చిత్తు చేయగలగాలి.. అంతేకాని అతని వ్యూహాలే పక్కవాడికి ఆయుధం కాకూడదు. ప్రతిపక్షనేతగా ప్రస్థానం ప్రారంభించిన నాటి నుంచి జగన్ ఈ విషయంలో ఘోరంగా విఫలమయ్యారు.

 

జగన్ వైఖరి మారితే తప్ప, పార్టీని నిలబెట్టుకోవడం కష్టం. డబ్బులు ఖర్చు చేయాలి.. నాయకుల్ని స్వంతంగా తయారుచేసుకోవాలి.. వాళ్లతో మమేకం కావాలి. తన కోసం వాళ్లు ప్రాణాలిచ్చేంతగా బంధం ఏర్పాటు చేసుకోవాలి. పకడ్బందీ రాజకీయం చేయడం జగన్ నేర్చుకోవాలి.. అప్పుడే జగన్... వైఎస్ జగన్ అవుతారు.. తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటారు.