తండ్రి పరువు తీస్తున్న జగన్...

 

కొడుకు అనేవాడు ఎవరైనా తండ్రి పరువు నిలబెట్టేట్టు వుండాలి. అంతేగాని తండ్రి పరువు కాస్తా తీసే విధంగా వుంటే ఎంతమాత్రం బాగోదు. తన కొడుకు వల్ల తన పరువు పోతూ వుంటే ఏ తండ్రి మనసైనా బాధపడుతుంది. ఒకవేళ సదరు తండ్రి గారు ఏ పుణ్యలోకాల్లోనో వుండి వుంటే ఆత్మక్షోభతో అల్లాడిపోతాడు. వై.ఎస్.జగన్ తండ్రిగారైన వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా ప్రస్తుతం ఇలాగే క్షోభిస్తూ వుండొచ్చని ఒక అంచనా. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలని, జగన్ చేస్తున్న రాజకీయాలని చూస్తే  ఎవరికైనా ఇలాంటి అంచనాలు, ఆలోచనలు రాక మానవు.

 

తండ్రి బతికి వున్నంత వరకు తండ్రి చాటు బిడ్డలాగా చేయాల్సిందంతా చేసిన జగన్ ఆ మహానేత కన్నుమూసిన దగ్గర్నుంచి రాజకీయంగా సొంత తెలివితేటలు ఉపయోగించడం ప్రారంభించాడు. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకూ జగన్ చేస్తున్న రాజకీయాలు ఆయనకే బెడిసి కొడుతూ వచ్చాయి తప్ప అప్పట్లో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీకి గానీ, ఇప్పుడు అధికారంలో వున్న చంద్రబాబుకు గానీ ఎలాంటి ఇబ్బందీ కలిగించలేకపోతున్నాయి. మొన్నటి ఎన్నికల ద్వారానే ముఖ్యమంత్రి అయిపోతానని కలలు కన్న జగన్ దారుణంగా షాకవ్వాల్సి వచ్చింది. వచ్చే  ఎన్నికలలో అయినా అధికారం చేజిక్కించుకుని తీరాలన్న ఉద్దేశంతో జగన్ చేయని పని లేదు. అధికార పక్షం మీద చేయని ఆరోపణ లేదు.. చల్లని బురద లేదు.. తిట్టని తిట్టు లేదు. అయినప్పటికీ జగన్‌ని ప్రజలు విశ్వసించడం లేదు. రాజకీయ వ్యూహాలు పన్నడంలో, తాను పన్నిన వ్యూహాల ద్వారా విజయాలు సాధించడంలో దిట్ట అయిన వైఎస్సార్ కుమారుడు ఇలా రాజకీయంగా నిరంతరం ఫెయిలవుతున్నాడు. కచ్చితంగా ఫెయిలయ్యే వ్యూహాలు పన్నుతూ అభాసుపాలైపోతున్నాడు.

 

ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుపుతున్న పాదయాత్రనే చూడండి... జనం నుంచి ఎలాంటి స్పందన లేకుండా అరకొర జనాలతో జరుగుతున్న పాదయాత్రగా ఇప్పటికే బాగా పబ్లిసిటీ వచ్చేసింది. పాదయాత్ర చేస్తున్న జగన్ని చూస్తుంటే ఒక్కసారి పాపం అని జాలి కూడా కలుగుతోంది. ఆరోజుల్లో వైఎస్సార్ పాదయాత్ర చేస్తే ఎలా వుండేది? ఒక గంభీరమైన నది ప్రవహిస్తున్నట్టు వుండేది. సింహం నడిచొస్తున్నట్టు వుండేది. ఆయన ప్రసంగాలు జనం చెవుల్లో మార్మోగేవి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మాత్రమే కాకుండా సామాన్య జనం కూడా వైఎస్సార్ వెంట మైళ్ళకు మైళ్ళు నడిచారు... అంత గొప్పగా పాదయాత్ర చేశారు కాబట్టే ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టగలిగారు. మరి ఇప్పుడు జగన్ చేస్తున్న పాదయాత్రో... ఎందుకులే.. చెప్పుకుంటే సిగ్గుచేటు. తన కుమారుడు ఈ తరహాలో చప్పచప్పగా పాదయాత్ర చేస్తూ వుండటం పైలోకాల్లోంచి చూస్తూ వైఎస్సార్ ఎంత ఆత్మక్షోభ అనుభవిస్తున్నారో ఏంటో!