జగన్ కు చెల్లెలి పోరు....వెనక్కు తగ్గేది లేదంటున్న షర్మిల...

 

పాపం జగన్ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది. ఇప్పటికే ఎన్నోసమస్యలతో సతమతమవుతున్న జగన్ కు మరో కొత్త సమస్య ఎదురైంది. ఈసారి ఆయన చెల్లెలు షర్మిల రూపంలో సమస్య వచ్చిపడింది. గత కొద్దికాలంగా.. జగన్ కు కుటుంబ సభ్యలకు మధ్య అంత సఖ్యత లేదన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఎందుకంటే.. తన కుటుంబ సభ్యలను పక్కన పెట్టి.. వేరే వాళ్లకు పార్టీలో పదవులు ఇవ్వడమే.

 

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణానంతరం.. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో జగన్ కొత్త పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు అతని కుటుంబమే అతనికి అండగా నిలిచింది. ఇక సార్వత్రిక ఎన్నికల సమయంలో.. జగన్ తన సోదరి షర్మిలను బాగానే వాడుకున్నారు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు కూడా  వైసీపీ పార్టీకి మద్దతుగా అన్నయ్యకు చేదోడు వాదోడుగా తన వంతు సహాయం చేయడానికి పాదయాత్రలు, ఓదార్పు యాత్రల‌ు చేసింది. ఇక జగన్ బయటకు వచ్చిన తరువాత షర్మిలకు ఉన్న క్రేజ్ ను చూసి...ఇలా అయితే తనకే నష్టమని భావించి.. చెల్లి అని కూడా చూడకుండా.. చాలా తెలివిగా సైడ్ చేసేశారు. ఇక అప్పటినుండి షర్మిల రాజకీయాల్లో కనిపించకుండా పోయారు. ఆ తరువాత తనకు ఎంపీ సీటు ఇస్తానని చెప్పడం.. ఇవ్వకపోవడం.. అన్నీ జరిగిపోయాయి. ఈ కారణాల వల్ల అన్నా చెల్లి మ‌ధ్య చిన్న మనస్పర్థలు వచ్చాయని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు జగన్ కి కొత్త సమస్యలు వచ్చి పడ్డాయా అంటే అవుననే అనుమానాలు వచ్చిపడుతున్నాయి.

 

అదేంటంటే కడప ఎంపీ అవినాష్ పనితీరు సరిగా లేదని జగన్ ఈ సారి అవినాష్ స్థానంలో తన సోదరి షర్మిలను పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారట. దీంతో వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులు దూరం కావడానికి సిద్దమవుతున్నట్టు జగన్ దృష్టికి వెళ్లడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చిందట. అవినాష్ విష‌యంలో జ‌గ‌న్ డెసిష‌న్ మార‌డం వెన‌క చాలా కార‌ణాలే క‌నిపిస్తున్నాయి. అవినాష్‌కు జిల్లాలో పార్టీ కార్య‌క‌ర్త‌ల నుంచి, నాయ‌కుల‌తో పాటు అధికార వ‌ర్గాల్లో కూడా మంచి పేరు ఉంది. దీంతో అవినాష్‌ను త‌ప్పించేందుకు పార్టీ కేడర్ కూడా ఒప్పుకోవ‌డం లేదట. మరో వైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో కడప నుండి తాను పోటీ చేస్తాన‌ని షర్మిల జగన్ ను అడిగిందట. అంతేకాదు షర్మిల కూడా ఎక్కడా తగ్గడం లేదట..  ఈసారి ఎవరు ఏం చెప్పినా… తాను వెనక్కు తగ్గేది లేదని అంటున్నారట. దీంతో  ఏం చేయాలో తెలియని పరిస్థితిలో జగన్ పడ్డాడట. మొత్తానికి ఇప్పటికే నేతల పోరుతోనే తట్టుకోలేకపోతున్న జగన్ కు ఇంటి పోరు కూడా తోడైంది. మరి గతంలో అంటే షర్మిల సైలెంట్ అయిపోయింది కానీ.. ఈసారి మాత్రం గట్టిగా పట్టుబడుతుందట.. జగన్ ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరి....