జగన్ పాదయాత్రకు మొదటి బ్రేక్ పడింది...

 

ఎన్నో అష్టకష్టాలు పడి జగన్ పాదయాత్రను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టి మరీ ఆయన నవంబర్ 6 నుండి తన పాదయాత్రను ప్రారంభించాడు. ఇక నాలుగు రోజుల పాదయాత్ర తరువాత జగన్ పాదయాత్రకు మొదటి సారి బ్రేక్ పడింది. ఎందుకో ఇప్పటికే అందరికీ బల్బు వెలిగి ఉంటది. అదే ఈరోజు శుక్రవారం కదా.. జగన్ కోర్టుకు వెళ్లాల్సిన రోజు. అక్రమాస్తుల కేసులో భాగంగా... నేడు హైదరాబాదులోని సీబీఐ కోర్టు విచారణకు హాజరయ్యారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని యర్రగుంట్ల వద్ద నిన్న సాయంత్రం జగన్ పాదయాత్ర ముగిసింది. ఇక అక్కడి నుండి కోర్టు విచారణ కోసం రోడ్డు మార్గంలో హైదరాబాద్ బయల్దేరారు. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో నగరంలోని లోటస్ పాండ్ లోని నివాసానికి ఆయన చేరుకున్నారు. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత... 10.30 నిమిషాలకు ఆయన కోర్టుకు చేరుకున్నారు.


కాగా పాదయాత్ర నేపథ్యంలో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇవ్వాలని జగన్ కోర్టును కోరినా.. కోర్టు మాత్రం మీ వ్యక్తిగత పనుల కోసం మేము మినహాయింపు ఇవ్వాలా అని చీవాట్లు పెట్టి కోర్టుకు రావాల్సిందే అని ఆదేశించింది. దీంతో జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు రావాల్సిందే. ఈ క్రమంలో జగన్ పాదయాత్రకు నేడు తొలి బ్రేక్ పడింది. రేపటి నుంచి జగన్ పాదయాత్ర యథావిధిగా కొనసాగనుంది. ఈరోజు కోర్టుకు హాజరైన తరువాత ఆయన నేరుగా మళ్లీ రోడ్డు మార్గంలోనే యర్రగుంట్ల వెళ్లనున్నారు. కాగా జగన్ తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, శ్రీనివాసన్, తదితర నిందితులు కూడా కోర్టుకు హాజరయ్యారు.