ఎన్నికల వరకు ఈ జగన్నాటకం కొనసాగవలసిందే

 

జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం విడిపోతున్నందుకు చాలా ఆందోళన చెందుతున్నట్లు, దానిని అడ్డుకొనేందుకు తనొక్కడే చాలా కృషి చేస్తున్నట్లు, తనతో ఎవరూ కలిసి రావడం లేదని ఆవేదన చెందుతున్నట్లు చాలా చక్కగా నటిస్తున్నపటికీ, నిజానికి వైకాపా రాత్రికి రాత్రి తెలంగాణా నుండి సీమాంధ్రకు దూకేయడంతోనే రాష్ట్ర విభజనకు ఆ పార్టీ సిద్దమని స్పష్టమయిన సంకేతం ఇచ్చింది. జగన్ చేస్తున్నవాదనలు, ప్రయత్నాలను కాసేపు పక్కన బెట్టి ఆలోచిస్తే, తెలంగాణాను పూర్తిగా వదులుకొన్న వైకాపాకు ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరిగితేనే సీమాంధ్రలో ఎంతో కొంత లబ్ది పొందగలదనేది ఎవరూ కాదనలేని సత్యం.

 

ఇంతవరకు జగన్ చేస్తున్న ప్రతీ ప్రయత్నమూ కూడా సీమాంధ్రలో తన పార్టీని బలపరచుకోవాలనే ఉద్దేశ్యంతో చేస్తున్నదే తప్ప, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కాదు. రాబోయే ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరిగితేనే, వైకాపా ప్రజలలో పేరుకుపోయున్న ప్రభుత్వ వ్యతిరేఖతను, వారిలో జ్వలించే సమైఖ్య సెంటిమెంటును ఉపయోగించుకొని రాజకీయ లబ్ది పొందగలదు. అప్పుడే అది చేస్తున్న సమైక్య పోరాటాలకు ఫలితం ఆశించలదు. అందుకే, జగన్మోహన్ రెడ్డి మనసులో రాష్ట్ర విభజనను కోరుకొంటున్నపటికీ, పైకి మాత్రం అవసరమయిన దానికంటే చాలా బిగ్గరగా సమైక్యాంధ్ర అంటూ నినదిస్తున్నారు. ఎన్నికలవరకు సీమాంధ్ర ప్రజలలో ఈ సమైక్య సెంటిమెంటును బలంగా ఉండేట్లు జాగ్రత్తగా కాపాడుకోగలిగితేనే వైకాపా లబ్ది పొందగలదు.

 

తెరాస తెలంగాణా సెంటిమెంటును ఏవిధంగా ఉపయోగించుకొని రాజకీయంగా ప్రయోజనం, పైచేయి సాధించిందో అదేవిధంగా వైకాపా కూడా సమైక్య సెంటిమెంటుతో 2014ఎన్నికలలో లబ్ది పొందాలని భావిస్తోంది. అందుకే జగన్ కేవలం 30యంపీ సీట్లు సాధించడం గురించి, ఎన్నికల తరువాత కేంద్రంలో ప్రభుత్వానికి మద్దతు గురించి తరచూ మాట్లాడుతుంటారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన గత కొంతకాలంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే మిషతో దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాధినేతలను, పార్టీ నేతలను కలుస్తున్నారు. తద్వారా జాతీయ స్థాయిలో తనకు, తన పార్టీకి ఒక గుర్తింపు ఏర్పరచుకొని, వారితో సంబంధాలు పెంచుకోవడానికి, తాను కాంగ్రెస్ వ్యతిరేఖిననే భావన రాష్ట్ర ప్రజలకు కలుగజేయడానికి తిప్పలు పడుతున్నారు. అయితే అతను కలిసిన రాజకీయ నేతలలో ఎంతమంది అయన మాటలను, ప్రయత్నాలను నిజంగా నమ్ముతున్నారో చెప్పడం కష్టం. ఎందుకంటే కాంగ్రెస్ తో ఆయనకున్నరహస్య అనుబందం గురించి వారికి తెలియదని అనుకోలేము.

 

ఏమయినప్పటికీ, జగన్ స్వయంగా చెప్పినట్లు కడదాకా అంటే 2014ఎన్నికల వరకు ఈ సమైక్యపోరాటం చేస్తూనే ఉంటారు.