ఓట్లు కోసం పాట్లు...

 

రాజకీయాల్లో అధికారంలోకి రావడానికి రాజకీయ నాయకులు ఏం చేయడానికైనా సిద్దపడతారన్న సంగతి తెలియంది ఏం కాదు. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, కాంగెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని చూస్తుంటే ఈ సంగతి మరోసారి గుర్తుకొస్తుంది. ఇద్దరూ హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే కొత్త పాట పాడుతున్నారు. ఇప్పటి వరకూ హిందు సంప్రదాయానికి కాస్త దూరంగా ఉన్న జగన్, రాహుల్ గుళ్లూ, గోపురాలు, స్వామీజీలు అంటూ తిరుగుతున్నారు.

 

ఈ మధ్య జగన్ ఏం చేస్తున్నా స్వామీజీల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. అంతేకాదు...వారి సూచనలు కూడా జగన్ పాటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జగన్ గత ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం వాస్తు సమస్య అని చెప్పడంతో.. జగన్ అది చేయడానికి కూడా సిద్దపడినట్టు సమాచారం. అంతేకాదు.. జగన్ తనపై వున్న క్రైస్తవ ముద్ర తుడుచుకోడానికే ఇలా స్వామీజీలని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డట్టు కూడా చెప్పుకుంటున్నారు. మరోవైపు కొంతకాలంగా హిందూ ఓటర్లను ఒకవైపు ఆకర్షించేలా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు చెక్‌ పెట్టేందుకు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. రాహుల్‌ గాంధీ కూడా హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు  రాహుల్‌ గాంధీ ఏదైనా యాత్ర ఆరంభించేముందు ఆ  ప్రాంతంలోని ప్రముఖ దేవాలయాన్ని సందర్శించేలా ప్రణాళిక రూపొందించుకున్నారని తెలుస్తోంది. గుజరాత్‌ పర్యటన సమయంలో రాహుల్‌ గాంధీ పలు ఆలయాల సందర్శన అందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో హిందు ఓటర్లను తమ వైపు తిప్పుకోవచ్చన్న వ్యూహాలు పన్నుతున్నారు. మొత్తానికి జగన్, రాహుల్ మైనార్టీ ఓట్ల కోసం బాగానే కష్టపడుతున్నారు. మెజారిటీ హిందూ ఓటర్లను ఆ‍కర్షించగలిగితేనే.. 2019లో పార్టీకి మెరుగైన స్థానాలు లభిస్తాయని తెలిసొచ్చినట్టుంది. మరి ఈ క్రమంలో మైనార్టీ ఓట్లు దూరం చేసుకుంటారో.. ఏం జరుగుతుందో... తెలియాలంటే కొంత సమయం వెయిట్ చేయాల్సిందే.