పాపం జగన్ కు ఆ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదుగా...

 

ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన టీడీపీలోకి చేరిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక అంతమంది వైసీపీ నేతలు టీడీపీ పార్టీలోకి జంప్ అవుతున్నా... జగన్ మాత్రం వారిని ఆపలేదు. ఇక ఎలాగూ వస్తున్నారు కదా అని టీడీపీ కూడా అందరినీ ఆహ్వానించేసింది. అప్పుడు జగన్ చంద్రబాబుకి ఫోన్ చేసింది లేదు...మా వాళ్లను మీ పార్టీలోకి తీసుకోవద్దు అని చెప్పింది లేదు. అయితే పాపం ఇప్పుడు జగన్ కు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. అదేంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీ లోకి వెళ్లాల్సిందే.

 

ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నియామకంపై కేంద్రం యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. గత కొద్ది కాలంగా ఏపీ అధ్యక్ష నియామకం పై చర్చలు జరుగుతుండగా.. ఆఖరికి సోము వీర్రాజు ను ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ పునరాలోచనలో పడ్డారు. అయితే బీజేపీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న కన్నా లక్ష్మీనారాయణ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అసంతృప్తి చెందారు. దీంతో ఆయన బీజేపీని వీడి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కన్నాతో పాటు ఇప్పుడు పలు నేతలు కూడా వైసీపీలోకి రావడానికి చూస్తున్నట్టు. అందులో కావూరి సాంబశివరావు, కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాటసాని ఈనెల 29న వైసీపీలో చేరుతారని తెలుస్తుండగా, కావూరి చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

 

అయితే ఇక్కడే జగన్ కు ఓ షాక్ తగిలింది. ఏపీ బీజేపీ నుంచి వైసీపీలోకి చేరికలకు ఆ పార్టీ హైకమాండ్ అడ్డుకట్ట వేసింది. ఈ నేపథ్యంలోనే జగన్ కు అమిత్ షాకు ఫోన్ చేసినట్టు సమాచారం. తమ పార్టీ నుండి నేతలు వైసీపీలోకి వస్తే వారిని చేర్చుకోవద్దని అమిత్ షా జగన్ కు చెప్పినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాదు... కన్నాకి కూడా షా ఫోన్ చేశారంట. కన్నా లక్ష్మీనారాయణకు అమిత్ షా ఫోన్ చేసి పార్టీలోనే ఉండాలని కోరారట. ఇక అమిత్ షానే కోరడంతో కన్నా కూడా తన మనసును మార్చుకున్నట్టు తెలుస్తోంది. అందుకనే.. ఆరోగ్యం బాలేదని.. ఏదో సాకు చెప్పి వైసీపీలో చేరే కార్యక్రమాన్ని ఆపేసి, ఆసుపత్రిలో చేరారని అంటున్నారు. పాపం జగన్ కు ఈ అవకాశం కూడా లేకుండా పోయింది.