ఎంత తిరిగినా ఉపయోగం లేదు.. జగన్‌కు పీకే షాక్..!!

 

అధికారమే లక్ష్యంగా.. జీవితంలో ఎప్పుడు కష్టపడని జగన్ 3వేల కిలోమీటర్లు నడుస్తున్నాడు. నీరసంగా ఉన్నా..  ఆరోగ్యం బాగోలేకున్నా.. ప్రతి శుక్రవారం కోర్టు పిలుస్తున్నా అన్ని తట్టుకుంటూ మడమ తిప్పడం లేదు ప్రతిపక్షనేత. దారి పొడుగునా.. ఆడా, మగ, చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా తల నిమురుతూ, ముద్దులు పెడుతూ యాత్ర సాగిస్తూ వస్తున్న జగన్మోహన్‌రెడ్డికి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ ఓ న్యూస్ చెప్పాడు. అది విన్న జగన్‌కి ఒకేసారి సంతోషం.. దు:ఖం పొంగుకొచ్చాయట. అంతగా ప్రశాంత్ ఏం చెప్పాడా అని ఆరా తీశారట కొందరు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల వ్యూహాకర్తగా బాధ్యతలు తీసుకున్న దగ్గరి నుంచి జగన్‌ను సీఎం చేసేందుకు పీకే టీమ్ ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తోంది. అలాగే కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపైనా సర్వేలు చేసి జగన్‌కు నివేదిక అందజేస్తోంది పీకే టీం.

 

ఇక అందలాన్ని అందుకోవడం కోసం చివరి ప్రయత్నంగా పాదయాత్రను భుజానికెత్తుకున్నారు జగన్. గత నెల 6వ తేదీన కడపజిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ సమాధి వద్ద నుంచి పాదయాత్రను ప్రారంభించారు ప్రతిపక్షనేత. కడప, కర్నూలు జిల్లాల్లో యాత్రను ముగించి రెండు రోజుల క్రితం ఆయన అనంతపురం జిల్లాలో ప్రవేశించారు. జగన్ నడిచిన నియోజకవర్గాల్లో నెల రోజులకి ముందు.. నెల రోజుల తర్వాత ఆయా ప్రాంతాల ప్రజలు ఏమనుకుంటున్నారు..? వైసీపీకి ఆదరణ పెరిగిందా తగ్గిందా..? అక్కడ ఇంకా సరిదిద్దుకోవాల్సిన లోపాలెంటీ..? అన్న దానిపై ప్రశాంత్ కిశోర్ సర్వే చేశారు. ఈ సర్వే నివేదిక చూసిన జగన్‌ షాక్ అయ్యాడని లోటస్ పాండ్ టాక్. ఆయా నియోజకవర్గాల్లో ఏ నలుగురు మాటల్లోనూ అసలు పాదయాత్ర ప్రస్తావన లేదట. పాతాళంలో పడిపోయిన వైసీపీ అధినేత ఇమేజ్ అక్కడే ఉంది తప్ప అంగుళం కూడా పైకి రాలేదట. ఇక జగన్‌ని చూసేందుకు జనం అంతగా ఆసక్తి చూపడం లేదట. నిజానికి అన్ని జిల్లాల కంటే ఎక్కువగా ఉండాల్సిన ఆయన సొంత జిల్లా కడపలో ఆదరణ అంతంత మాత్రమేనట. అన్న వస్తున్నారని వైసీపీ శ్రేణులు చేసిన హంగామా తప్పితే.. ప్రజల్లో ఆయన పాదయాత్రకు ఎలాంటి సానుకూల వాతావరణం లేదని పీకే నివేదిక బట్టబయలు చేసిందట.

 

అంటే మీరు ఎంత తిరిగినా లాభం లేదని పీకే ఇన్‌డైరెక్ట్‌గా జగన్‌కి చెప్పాడా అని వైసీపీ కండువాలు గుసగుసలాడుకుంటున్నాయి. తమ అధినేత అంతగా కష్టపడుతుంటే పాదయాత్రకు ఇలాంటి రిజల్ట్ రావడం ఏంటని వైసీపీ శ్రేణులు కాస్త నిరాశకు లోనవుతున్నాయట. అయితే కేవలం రెండు జిల్లాల సర్వే ఫలితాలను బట్టి ఒక నిర్ణయానికి రాలేమని.. ఇంకా పది జిల్లాల్లో జగన్ పాదయాత్ర చేయాల్సి ఉన్నందున ఆ తరువాత రిజల్ట్ మారే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.