వైసీపీ నాయకులు తిట్టుకోక ఇంకేం చేస్తారు?

 

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తామనే నీటి బుడగ మూడున్నర  ఏళ్ళ క్రితమే భళ్ళుమని పగిపోయినా వైసీపీ నాయకులు నిన్న మొన్నటి వరకూ తమ ఆశావాదాన్ని వీడలేదు. తమ నాయకుడు జగన్ ఏదో ఒక మాయ చేసి 2019 ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తెస్తాడని ఆశపడుతూ వచ్చారు. తమ పార్టీ జనం నోళ్ళలో నానడానికి పీకేలాంటి పరాయి రాష్ట్రం వారి సలహాలు తీసుకుని చేస్తున్న కార్యక్రమాల వల్ల ఓట్ల వర్షం కురుస్తుందని ఆశపడ్డారు. అయితే తమ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, చేసిన వ్యాఖ్యల వల్ల తమకే నష్టం జరిగిందన్న విషయం నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక తర్వాత స్పష్టంగా తెలిసిపోయింది. దాంతో వైసీపీ కేడర్‌లో అంతర్మథనం మొదలైంది. ఇంతకాలం వైసీపీని నమ్ముకుని, ఆ పార్టీకి సపోర్ట్‌గా అడ్డమైన పనులన్నీ చేసి పొరపాటు చేశామనే పశ్చాత్తాపం కూడా మొదలైంది. వైసీపీ ఎమ్మెల్యేలుగా వున్నవారే త్వరలో  ఆ పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ కేడర్లో అశాంతి మొదలైంది. ఆ అశాంతి అసహనం రూపంలో బయటపడుతోంది. తాజాగా విజయవాడలో గౌతమ్ రెడ్డి, వంగవీటి రాధా మధ్య జరిగిన రచ్చ కూడా ఈ అసహనంలో భాగంగానే భావించవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

 

విజయవాడ వైసీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి వంగవీటి రంగాని విమర్శి్స్తూ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. అయినా చేశారు. ఎప్పుడు ఏ వివాదం దొరుకుతుందా, రచ్చ చేద్దామా అని ఎదురుచూసే వంగవీటి రాధాకి ఈ వ్యాఖ్యలు లడ్డులాగా దొరికాయి. దాంతో ఆయన తన మాతృమూర్తి రత్నకుమారితో కలసి చేయాల్సిన రచ్చ చేశారు. తల్లితో కలసి పోలీస్ స్టేషన్లో నేల మీద బైఠాయించి హంగామా చేశాడు. విజయవాడ వైసీపీలో తలెత్తిన ఈ సంక్షోభాన్ని నివారించడానికి వైసీపీ నాయకుడు జగన్ ఆగమేఘాల మీద గౌతమ్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా మంటలు చల్లారలేదు.

 

పైకి చూడ్డానికి ఇదేదో పార్టీలోని ఇద్దరు నాయకుల మధ్య తలెత్తిన టీకప్పులో తుఫానులాంటి వివాదం అని అనిపించినప్పటికీ, ఇది వైసీపీలో పెరిగిపోతున్న అసహనం, నిస్సహాయతలకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఎలాగూ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయని వస్తున్న సంకేతాలతో నిరాశలో కూరుకుపోయిన పార్టీ నాయకులు నిరాశతో చేస్తున్న చర్యలుగానే వీటిని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ వైసీపీలో ఇలాంటి అంతర్గత విభేదాలు జగన్‌కి భయపడి బయటకి రాలేదు. ఇప్పుడు విజయవాడతో అది మొదలైందని, ఇది ఏ స్థాయికి చేరుతుందే వేచి చూడాల్సి వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.