కమలం వైపు జగన్ కదులుతున్నారా… కమలమే, కమాన్ అంటోందా?

2014 నుంచీ విజయపరంపరలో సాగుతోంది బీజేపి. మోదీ ప్రధాని అయిన తరువాత చాలా రాష్ట్రాలే కమలం ఖాతాలో పడ్డాయి. బీహార్, దిల్లీ ఎన్నికల్లో తీవ్రమైన ఓటమి ఎదురైనా మళ్లీ ఈ మధ్య కాలపు ఎన్నికల ఫలితాలతో అందరికీ బలమైన సమాధానం ఇచ్చింది కాషాయదళం. కాని, ఇప్పుడు మరో ఎన్నిక ఎన్డీఏకు, మరీ ముఖ్యంగా బీజేపికి సవాలుగా మారింది. అదే రాష్ట్రపతి ఎన్నిక! ప్రణబ్ ముఖర్జీ తరువాత దేశ ప్రథమ పౌరుడు అయ్యేది ఎవరన్న సస్పెన్స్ అందరిలోనూ వుంది! అయితే, ప్రెసిడెంట్ ఎలక్షన్ రానున్న 2019 ఎన్నికల ముఖ చిత్రాన్ని కూడా కొద్దికొద్దిగా స్పష్టం చేస్తున్నట్టు కనిపిస్తోంది!

 

రాష్ట్రపతి ఎన్నికలు మోదీ సర్కార్ కి పెద్ద ఇబ్బందేం కాదు. యూపీ మొదలు మణిపూర్ వరకూ చాలా రాష్ట్రాలు బీజేపీ చేతిలో వున్నాయి. అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల చేతిలో వున్న రాష్ట్రాలతో కూడా పెద్ద టెన్షన్ ఏం లేదు. అందుకు మంచి ఉదాహరణ మన ఏపీనే! ఇక్కడ అదికారంలో వున్నది టీడీపీ కాబట్టి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు సునాయాసంగానే పొందవచ్చు. కాని, ట్విస్ట్ ఏంటంటే, ఆంధ్రా అసెంబ్లీలో ఎప్పుడూ ఉప్పు, నిప్పులా వుండే టీడీపీ, వైసీపీ రెండూ మోదీ నిలబెట్టబోయే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కే మద్దతు పలకునున్నాయి. ఎన్డీఏలో భాగస్వామి అయిన టీడీపీ సపోర్ట్ చేస్తుందని మనకు ముందు నుంచీ తెలుసు. కాని, లేటెస్ట్ మీటింగ్ తరువాత జగన్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు! అదే ఇప్పుడు అనేక ఊహాగానాలకు కారణం అవుతోంది!

 

ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా వున్న శివసేన ఇప్పటి వరకూ మోదీ నిర్ణయించే అభ్యర్థికి తమ మద్దతని చెప్పటం లేదు. చాలా రోజులుగా గుర్రుగా వుంటోన్న ఉద్ధవ్ థాక్రే రాష్ట్రపతి ఎన్నిక టైంలో బీజేపికి చుక్కలు చూపాలని ఆశ పడుతున్నారు. కాని, ఎన్డీఏలో భాగస్వామి కాని వైసీపీ మాత్రం బీజేపి రాష్ట్రపతి అభ్యర్థికి క్లియర్ సపోర్ట్ అంటోంది! దీనర్థం ఏంటి? జగన్ మాటల్లో అయితే ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి గెలిచే అవకాశం లేదు కాబట్టి వైసీపీ అతి పెద్ద పార్టీ అయిన కమలదళానికే మద్దతు ఇస్తోంది! కాని, దీని వెనుక ఇంతే మ్యాటర్ వుందని విశ్లేషకులు భావించటం లేదు!

 

జగన్ పైన వున్న కేసులు, జైలుకు వెళ్లాల్సి వచ్చే గండం ఆయన్ని మోదీతో రాజీకి తీసుకొచ్చాయంటున్నారు విశ్లేషకులు. అంతే కాక, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎన్డీఏలో చేరి ఏపీలో అధికారం చేపట్టాలని జగన్ భావిస్తున్నారట! అలాగే, కేంద్రంలోనూ మంత్రి పదవులు తీసుకుని అధికారం ఆస్వాదించాలని ఆయన ఆశిస్తున్నారట! పార్టీ పెట్టి ఇంత కాలమైనా ప్రతిపక్షంలో కాలం గడిచిపోతోంది. అందుకే, జగన్ బీజేపితో పొత్తుకి తహతహలాడుతున్నారని టాక్! మరి ఎన్డీఏలో ఎంతో కీలకమైన టీడీపిని కాదని మోదీ, అమిత్ షా జగన్ ను చేరదీస్తారా? హిందూత్వా బ్రాండ్ ను నమ్ముకునే కాషాయదళానికి క్రిస్టియన్ మైనార్టీల్లో మంచి ఫాలోయింగ్ వున్న వైసీపీతో పొసుగుతుందా? ఇవన్నీ ముందు ముందు తేలాల్సిన ఆసక్తికర అంశాలు!

 

ఇక మోదీ పట్టుదలతో వర్కవుట్ చేస్తోన్న ఒక దేశం ఒకేసారి ఎన్నికలు కాన్సెప్ట్ కు కూడా జగన్ బేషరతుగా ఓకే చెప్పారు! మరో వైపు ప్రత్యేక హోదా మరిచిపోలేదని అన్నప్పటికీ దానిపై ప్రత్యేకంగా గొడవ చేయటం ఇక మీదట వుండదని జగన్ మాటలు వింటే అర్థమైపోతుంది! ఇలా ఇంత చక్కగా మోదీకి మద్దతు పలికిన విపక్ష పార్టీ వైసీపీ తప్ప దేశంలో మరేదీ లేదనుకుంటా!

 

మోదీకి, బీజేపికి, కేంద్రానికి జగన్ మద్దతు వెనుక ఆయన మీద వున్న కేసులు కారణమా? లేక భవిష్యత్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కమలానికి ఫ్యాన్ని దగ్గర చేసే వ్యూహమా? లేక వ్యక్తిగత, రాజకీయ కారణాలు రెండూ వున్నాయా? ఏమో.. ఏమీ చెప్పలేం! కాని, ఇప్పుడు బాల్ బీజేపి కోర్టులో వుంది. టీడీపీ జాగ్రత్తగా జగన్ కదలికల్ని, బీజేపి హావభావాల్ని గమనిస్తూ వుండాల్సిందే!